Nara Lokesh – AP High Court: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవేళ హైకోర్టులో రెండు లంచ్ మోషన్ పిటిషన్ లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సాయంత్రం 2.15 గంటల తర్వాత విచారణ జరిగే అవకాశం ఉంది. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఒక పిటిషన్ దాఖలు చేయగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ ఇచ్చిన 41 ఏ నోటీసులో నిబంధనలు సవాల్ చేస్తూ మరో పిటిషన్ ను లోకేష్ హైకోర్టులో దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ కు ఇటీవల సీఐడీ అధికారులు సీఆర్పీసీ 41 ఏ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 4వ తేదీన విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ ను కలిసి సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. అయితే సీఐడీ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న పలు నిబంధనల పట్ల లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో ప్రధానంగా హెరిటేజ్ కు సంబంధించి తీర్మానాలు, అకౌంట్ బుక్స్ తీసుకురావాలని కోరడంపై లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రెండు నిబంధనలను లోకేష్ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రస్తుతం హెరిటేజ్ సంస్థలో తాను డైరెక్టర్ గా లేననీ, గతంలోనే తప్పుకున్నాననీ, తాను ఇప్పుడు ఆ వివరాలు ఎలా తీసుకువస్తాను అని ప్రశ్నిస్తున్నారు.

లోకేష్ తరపు న్యాయవాదులు ఈ లంచ్ మోషన్ పిటిషన్ తో పాటు ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. నారా లోకేష్ 2017 నుండి పంచాయతీరాజ్ మరియు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ శాఖకు ఫైబర్ గ్రిడ్ కు ఎలాంటి సంబంధం లేదనీ, ఎక్కడా తన సంతకాలు చేయనప్పటికీ ఫైబర్ గ్రిడ్ కేసులో తన పేరును నిందితుడుగా చేర్చి అరెస్టు చేయాలని చూస్తున్నందున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో కోరారు. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేశారనీ, ఆ తర్వాత ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును అరెస్టు చూపేందుకు సీఐడీ పీటీ వారెంట్ పిటిషన్లను దాఖలు చేసింది.
ఈ తరుణంలో ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారంటూ పలువురు మంత్రులు, వైసీపీ నేతలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టులో నారా లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ లు, అటు సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ లపై ఇవేళ సాయంత్రం విచారణ జరగనుండటంతో తీర్పులు ఏ విధంగా వస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.