Chandrababu Naidu- Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మూడు వారాలకుపైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నారు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రెండు రోజుల పాటు చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ కూడా చేశారు. చంద్రబాబు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ నేడు (అక్టోబర్3) విచారణ జరగనుంది.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా తనపై పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ కేసును కొట్టేయాలని చంద్రబాబు క్వాష్ పిటిషన్ లో కోరారు. జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనున్నది. సర్వోన్నత న్యాయస్థానంలోని 6వ నెంబర్ కోర్టులో ఐటం నంబర్ 63 కింద ఈ కేసు లిస్ట్ అయ్యింది.

గత వారం సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో చివరి నిమిషంలో ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ భట్టి విముఖత చూపడంతో విచారణ వాయిదా పడింది. వేరే ధర్మాసనానికి కేసు మార్పు చేసి అత్యవసర విచారణ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలప్రదం కాలేదు. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా .. సీజే ధర్మాసనం ముందు ప్రత్యేకంగా మెన్షన్ చేసి అత్యవసర విచారణ జరపాలని కోరారు.
అయితే అక్టోబర్ 2వ తేదీ వరకూ సుప్రీం కోర్టుకు సెలవుల నేపథ్యంలో అక్టోబర్ 3 వ తేదీ(నేటికి)కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. కేవియట్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని సుప్రీం కోర్టుకు విన్నవించింది. అయితే నేటి పిటిషన్ల జాబితాలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ చిట్టచివరిది గా (నెంబర్ 63) లిస్ట్ అవ్వడంతో ఈ రోజు విచారణకు వస్తుందా లేదా అన్న విషయంపై సందిగ్దత కొనసాగుతోంది.
చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీం ధర్మాసనం సమర్ధిస్తుందా లేక చంద్రబాబుకు తక్షణ ఉపశమనం కల్గించేలా ఏమైనా ఉత్తర్వులు ఇస్తుందా అనే దానిపై రకరకాల ఊహగానాలు కొనసాగుతున్నాయి. ఇటు బలమైన వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా, సిద్ధార్ధ్ అగర్వాల్ లు సిద్దం అవ్వగా, ప్రభుత్వం తరుపున ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్ తదితరులు వాదనలు వినిపించనున్నారు.
Times Now Survey: 2024 ఎన్నికల్లో తెలంగాణ, ఏపిలో ఏ పార్టీకి ఎన్ని లోక్ సభ స్థానాలు వస్తాయంటే..?