ఇప్పటి వరకూ ఏపికి ఇరుగుపొరుగున ఉన్న తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నర్ ల తీరుతో ముఖ్యమంత్రులు ఇబ్బందులు పడుతున్నారు. అటు తమిళనాడులో గవర్నర్ రవితో స్టాలిన్ సర్కార్, ఇటుపక్క తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో కేసిఆర్ సర్కార్ ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఆమోదానికి గవర్నర్ పేచీలు పెడుతున్న సంగతి తెలిసిందే. పొరుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉన్నప్పటికీ, ఏపిలో అటువంటి పరిస్థితి రాలేదు. ఏపిలోని వైసీపీ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీకి మిత్ర పక్షం కానప్పటికీ ఇప్పటి వరకూ ఉన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆమోదిస్తూనే వచ్చారు. నిబంధనలకు విరుద్దంగా జరిగిన పలు నిర్ణయాలను సైతం గవర్నర్ ఆమోదించడం, ఆ తర్వాత అవి న్యాయ సమీక్షలో వీగిపోవడం జరిగాయి. గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంలో గానీ, ఆ తర్వాత మూడు రాజధానుల బిల్లు ఆమోదంలో గానీ ఇలా అనేక సందర్భాల్లో ఒక్క దస్త్రాన్ని కూడా రాజ్ భవన్ వెనక్కు పంపిన దాఖలాలు లేవు.

బిశ్వభూషణ్ హరిచందన్ న్యాయశాస్త్ర పట్టభద్రడైనప్పటికీ బీజేపీ రాజకీయ నేపథ్యంతో వచ్చిన నేత కావడంతో జగన్ సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాలను సమీక్షించకుండా గుడ్డిగా ఆమోదిస్తూ వచ్చారనే అపవాదు ఉంది. జగన్ సర్కార్ తీసుకున్న అనేక అనాలోచిత నిర్ణయాలన ఏపీ హైకోర్టు తప్పుబట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పులను తప్పుబట్టడం, సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్లడం లాంటి చర్యలు చేపట్టారే కానీ చట్ట, న్యాయపరమైన విషయాలను సమీక్షించడం లేదు. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పు అనంతరం ఏపీ అసెంబ్లీలో శాసన అధికారం – న్యాయ శాఖ జోక్యంపై సుదీర్ఘ చర్చ కూడా జరిగింది. ఇప్పటి వరకూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పూర్తి అనుకూలంగా వ్యవహరించడంతో జగన్మోహనరెడ్డి సర్కార్ కు అటు తమిళనాడు, ఇటు తెలంగాణలో మాదిరిగా రాజ్ భవన్ నుండి ఎటువంటి సమస్యలు ఎదురుకాలేదు. అయితే ఇప్పుడు న్యాయ కోవిదుడైన సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ ఏపికి గవర్నర్ గా నియమితులు కావడం జగన్మోహనరెడ్డి సర్కార్ కు ఇబ్బందులు తప్పవేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవలి కాలం వరకూ ఏపి సర్కార్ కు పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్న కేంద్రం ఇప్పుడు అనూహ్యంగా ఏపి రాజధాని విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం, తాజాగా న్యాయశాస్త్రాన్ని అవపోసన పట్టిన రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిని గవర్నర్ గా ఏపికి పంపడం దేనికి సంకేతమో రాజకీయ వర్గాలకు అంతుచిక్కడం లేదు. ఏపి గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ రాజకీయ నేపథ్యం నుండి వచ్చిన నేత కాదు కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా అది చట్టపరంగా సమ్మతమైనదా కాదా అనే విషయాలను పరిశీలించి ఆమోదించే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి ఇబ్బందికరమే అవుతుందని అంటున్నారు. సర్కార్ విషయంలో కొత్త గవర్నర్ తీరు ఎలా ఉంటుంది అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.