Tirumala: తిరుమల కొండ పై తీవ్ర విషాదం నెలకొంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొతిరెడ్డిపాలెం నుండి వెళ్లిన దినేష్, శశికళ దంపతుల కుమార్తె లక్షిత (6) చిరుత దాడిలో మృతి చెందింది. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చిన్నారి లక్షిత సహా కుటుంబ సభ్యులు కాలినడకన శ్రీవారి దర్శనం కోసం బయలుదేరారు. రాత్రి 11 గంటల సమయానికి లక్ష్మీనరసింహ స్వామి గుడి వద్దకు చేరుకున్నారు. మరో గంట సమయంలో తిరుమలకు చేరుకుంటారు అనుకుంటుండగా, ముందు వెళుతున్న చిన్నారి లక్షితపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది.

కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేయడంతో చిరుత చిన్నారిని అడవిలోకి ఈడ్చుకువెళ్లింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రాత్రి సమయంలో కావడంతో గాలింపు చర్యలు చేపట్టేందుకు కుదరలేదు. ఇవేళ ఉదయం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొద్ది దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బాలిక మృత దేహాన్ని చిరుత సగం తినేసినట్లు గుర్తించారు. గతంలోనూ కాలినడక మార్గంలో బాలుడుపై చిరుత దాడి ఘటన జరిగింది. కాలినడక మార్గంలో భద్రత సిబ్బంది లోపం తీవ్రంగా ఉందని ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి కాలినడక మార్గంలో భద్రత ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.