వాల్తేరు వీరయ్య 200 రోజుల ఈవెంట్ పంక్షన్ లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని పరోక్షంగా స్పందించారు. సినీ పరిశ్రమలో చాలా మంది పకోడీ గాళ్లున్నారు. ప్రభుత్వం ఎలా ఉండాలో ఆ పకోడీగాళ్లు కూడా సలహాలు ఇస్తున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేశారు. “సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది పకోడీ గాళ్లు ఉన్నారు. వాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహా ఇస్తున్నారు. ఇలాంటి వాళ్లు తమ వాళ్లకు (పవన్ ను కూడా ఉద్దేశించి) కూడా సలహాలిస్తే బాగుంటుంది. మనకెందుకురా బాబూ రాజకీయాలు..మన డ్యాన్సులు, మన ఫైట్లు మనం చేసుకుందాం” అని వాళ్లకు కూడా సలహా ఇస్తే మంచిదంటూ నాని చురకలు అంటించారు.

మెగా స్టార్ చిరంజీవి తొలిసారిగా జగన్ సర్కార్ పై పరోక్షంగా చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం అయ్యాయి. మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ సర్కార్ పై పరోక్షంగా చిరంజీవి కామెంట్స్ చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడ్డారంటూ చిరు వ్యాఖ్యానించారు. “మీ ప్రతాపం సినీ పరిశ్రమపై కాదు.. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం పై దృష్టి పెట్టండి. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టాలి. ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు” అంటూ చిరు కామెంట్స్ చేశారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తే అంతా తలవంచి నమస్కరిస్తారని చిరు అన్నారు. చిరు వ్యాఖ్యలు అటు సినీ పరిశ్రమలో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. చిరు వ్యాఖ్యలపై కొడాలి స్పందిస్తూ కౌంటర్ ఇవ్వడంతో అటు సినీ పరిశ్రమ, ఇటు ఏపీ సర్కార్ మధ్య మాటల యుద్దం కొనసాగుతుందని భావిస్తున్నారు.
జగన్ సర్కార్ పై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు