ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కర్ర సాము చేస్తూ కింద పడటం పార్టీ శ్రేణులను ఒక్క సారిగా ఆందోళనకు గురి చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు మార్కెట్ యార్డ్ నుండి 108 కలశాలతో శివాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో వందలాది మంది కార్యకర్తల మధ్య ఎమ్మెల్యే రాచమల్లు కర్రసాము చేశారు. పార్టీ శ్రేణులు, అభిమానులు ఆనందంతో ఈలలు వేస్తూ కర్రసాము తిలకిస్తుండగా కర్రసాము చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు ఒక్క సారిగా కిందపడిపోయారు.

కర్ర కాలుకి అడ్డం పడటంతో పడిపోయారు. దీంతో ఒక్క సారిగా ఆందోళనకు గురై హుటాహుటిన కార్యకర్తలు ఎమ్మెల్యేను పైకి లేపారు. అనంతరం కిందపడటంతో ఏమైనా గాయాలు అయ్యాయా అంటూ ఎమ్మెల్యేను పలువురు కార్యకర్తలు అడగ్గా ఏమీ అవ్వలేదంటూ ఆయన అక్కడ నుండి వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయంలోకి వెళ్లి పూజలు చేశారు. అయితే ఎమ్మెల్యే కర్రసాము చేస్తున్న సమయంలో అక్కడ కొందరు సెల్ ఫోన్లలో వీడియోను చిత్రీకరించి పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది.
