పెద్దాయనకు ఫ్యాన్స్ తలంటు!

ముంబై: బాలీవుడ్ పెద్దాయన అమితాబ్ బచ్చన్ తీరిగ్గా కూర్చుని పోస్ట్ చేసిన ఒక ఫొటో.. ఆయనకు ఎక్కడ లేని తిప్పలు తెచ్చిపెట్టింది. స్విమ్మింగ్ ట్రంక్స్ వేసుకుని ఆయన తీయించుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో జనమంతా ఆయనను తిట్టి పోశారు. దాంతో ఆ ఫొటో పెట్టి తాను చాలా పెద్ద తప్పు చేశానని అమితాబ్ ఒప్పుకోవాల్సి వచ్చింది. దాదాపు నెల రోజుల క్రితం స్విమ్మింగ్ ట్రంక్స్ వేసుకుని, నల్ల కళ్లద్దాలు ధరించి ‘టాప్ హాఫ్’ అన్న కేప్షన్ తో ఒక ఫొటో ఇన్ స్టాలో ఆయన పోస్ట్ చేశారు. ‘‘ద బీచ్ కూంబర్ ఇన్ మారిషస్.. మై ఫస్ట్ విజిట్’’ అని కూడా రాశారు. అది మర్చిపోలేని అనుభవమని, ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ ఫొటో తీసుకున్న కొద్ది సేపటికే సముద్రంలోకి వెళ్లానని, అక్కడ తనను చేపలు కొరికాయని తెలిపారు. అయితే వాటి పేరు తెలియదన్నారు. దానికి తన దుస్తులు నచ్చినట్లు లేవన్నారు.

అయితే, ఇటీవల తన కొత్త సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈ ఫొటో గురించి అమితాబ్ ప్రస్తావించారు. దాని గురించి వ్యాఖ్యానించాలని అడిగినప్పుడు.. ‘‘ఆ ఫొటో పెట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను. తొలిసారి మారిషస్ వెళ్లినపుడు ఈతకొట్టడానికి వెళ్తుండగా అక్కడో వ్యక్తి నాతో కలిసి ఫొటో తీసుకుంటూ ఇది కూడా తీశాడు. ఈమధ్య తనను తాను పరిచయం చేసుకోడానికి నాకీ ఫొటో పంపాడు. దాంతో అందులోంచి నా ఫొటో మాత్రమే తీసి పోస్ట్ చేశా. ఫొటో పెట్టిన తర్వాత నన్ను చాలామంది గట్టిగా తిట్టిపోశారు’’ అని అమితాబ్ చెప్పుకొచ్చారు. దాంతో పెద్దాయనకు అభిమానుల నుంచి కాస్త గట్టిగానే పడినట్లు అందరికీ అర్థమయ్యింది.