Angry: ఒక మనిషికి కోపం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కోపం రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుని కోపం తెప్పించిన పరిస్థితులను గురించి ఒకసారి ఆలోచిస్తే మనం కోపం,చిరాకు పరాకు , మాట దూకుడు తనాన్ని ఎంతో కొంత అదుపు చేసుకోవచ్చు.ఒకవేళ కోపం వచ్చినప్పుడు కోపం తెప్పించే వారితో మాట్లాడకుండా, చూడకుండా కాసేపు నిశ్శబ్దం గా ఉంటే కాసేపటికి కోపం తగ్గిపోతుంది. అలాకాక, కోపం తెప్పించిన వారి గురించి ఇతరుల దగ్గర మాట్లాడితే మరికొన్ని సమస్యలకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది. అందుకే కోపం తో ఉన్నప్పుడు దాని గురించి వేరే ఒకరి దగ్గర మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటం చాలా మంచిది.
కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేము అని మన పెద్దలు చెబుతూ ఉంటారు.రంపం తో శరీరాన్ని కొస్తే వచ్చే బాధ కన్నా,కోపం లో నోటి వెంట వచ్చే మాట తో కలిగే బాధ ఎక్కువ కాబట్టి కోపం లో ఉన్నప్పుడు ఏది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడకుండా కంట్రోల్ చేసుకునే విధంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. కోపాన్నీ తేలికగా పెట్టుకోవాలి అంటే అంకెలు లెక్కపెట్టడం ఒక మంచి మార్గం అనే చెప్పాలి. కోపం వస్తే దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఒకటి నుంచి పది అంకెలు లెక్కపెడితే నెమ్మది గా కోపం తగ్గుతుంది.
అయితే మీరు నాకు కోపం ఎక్కువగా వస్తుంది దాన్ని తగ్గించాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ అంకెలు లెక్కపెట్టడం వలన ప్రయోజనం ఉంటుంది. ముందు అనుకోక పోతే కోపం వచ్చే సమయానికి ఆ విషయం కూడా గుర్తుకు రాదు. కొన్ని రకాల వ్యాధుల వల్ల కూడా మనుషుల కు చాలా త్వరగా కోపం వస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి లో ఇది కనిపిస్తుంది. ఇలాంటి వారి మీద సానుభూతి చూపి మంచి మాటలు చెప్పి ఊరడించాలి . కోపం ఒక చెడు లక్షణం దాన్ని వదిలించుకోవాలి అని ఆలోచించే వాళ్లకి అది ఎప్పటికైనా సాధ్యమవుతుంది. అసలు దాని గురించి ఆలోచించకుండా అదొక గొప్పగా భావించే వారికి అనేక రకాల సమస్యలు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తూనే ఉంటాయి.