అధిక బరువు సమస్య ప్రస్తుత తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీని కారణంగా డయాబెటిస్, గుండె జబ్బులు వంటి వ్యాధులు వస్తున్నాయి. అందువల్ల అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక మంది రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధిక బరువు తగ్గాలన్నా, బరువు పెరగకుండా ఉండాలన్నా.. రోజూ ఉదయాన్నే కింద తెలిపిన పలు సూచనలు పాటించాలి. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. ఇక ఆ సూచనలపై ఒక లుక్కేద్దామా..!
* రోజుకు తగినన్ని గంటల పాటు నిద్రించాలి. లేదంటే శరీరంలో ఎండోక్రైన్ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. దీని వల్ల శరీరం ఇన్సులిన్ ను సరిగ్గా గ్రహించలేదు. ఫలితంగా అధికంగా బరువు పెరగడంతోపాటు డయాబెటిస్ బారిన పడతారు. కనుక నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రించాలి. అలాగే రాత్రి పూట త్వరగా పడుకుని ఉదయాన్నే నిద్ర లేవాలి. నిత్యం ఉదయాన్నే చేయాల్సిన కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి.
* చాలా మంది ఉదయాన్నే నిద్రలేస్తారు కానీ వ్యాయామం చేయరు. కానీ ఉదయం వ్యాయామం చేయడం వల్ల శరీరంపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది.
* నిత్యం ఉదయాన్నే కొంతసేపు సూర్యరశ్మిలో గడపడం వల్ల విటమిన్ డి అందుతుంది. విటమిన్ డిని తయారు చేసుకునేందుకు శరీరం కొవ్వును ఖర్చు చేస్తుంది. అందువల్ల ఉదయం ఈ పని కూడా చేయాలి.
* రోజుకు మనకు ఎన్ని క్యాలరీలు కావాలు ఉదయాన్నే నిర్ణయించుకోవాలి. శారీరక శ్రమ చేయాల్సి వస్తుందనుకుంటే ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎక్కువ క్యాలరీలను ఇచ్చే ఆహారాన్ని ఉదయాన్నే తీసుకోవాలి.
* యోగా, మెడిటేషన్ చేయడం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. శరీరంపై నెగెటివ్ హార్మోన్ల ప్రభావం పడకుండా ఉంటుంది. ఫలితంగా బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
* రోజూ ఉదయాన్నే వెయింగ్ స్కేల్ ద్వారా బరువు ఎంత ఉన్నారో చెక్ చేసుకోవాలి. దీని వల్ల కూడా అధిక బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.