మనం తినే ఆహరం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్న సంగతి చదువు లేని వారికి కూడా తెలుసు. బండగా చెప్పుకోవాలంటే కూరగాయలు, పళ్లు ఎక్కువగా ఉన్న సమతుల ఆహారం మంచి ఆరోగ్యానికి దారి తీస్తుంది. చక్కెర, ఉప్పు, నూనెలు ఎక్కువగా ఉన్న ఆహారం ఆరోగ్యపరమైన సమస్యలకు దారి తీస్తుంది. ఈ విషయం ఇవాళ తెలియనివారు లేరు.
అయితే ఫలానా ఆహారం ఫలానా ఆరోగ్య పరిస్థితిపై ఫలానా ప్రభావం చూపుతుందని కరాఖండీగా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒక మంచి ఆహారం ఎక్కువ తినే వారు మిగతా ఆరోగ్యకరమైన ఆహారం కూడా బాగానే తీసుకుంటారు. కాబట్టి ఏ ఆహారం వల్ల ఏ ప్రభావం కలిగిందన్నది తేల్చడం కష్టం. అయినా గానీ ఒక శాస్త్రవేత్తల బృందం కాయధాన్యాలు (చిక్కుడు, బఠానీ, అలసందలు, కందులు, పెసలు, సెనగలు, రజ్మా, చిమ్మట, ఉలవలు వంటివి) గుండె ఆరోగ్యంపై చూపించే ప్రభావం గురించి పరిశోధన చేసింది.
కాయధాన్యాల్లో పీచు, ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు ఎక్కువ ఉంటాయి. కొవ్వు చాలా తక్కువ ఉంటుంది. కాయధాన్యాలు తీసుకున్నందువల్ల చెడు కొల్లెస్ట్రాల్ తగ్గుతుందనీ. రక్తపోటు కూడా తగ్గుతుందనీ. మధుమేహం అదుపులో ఉంటుందనీ చెబుతున్నారు. అయితే కాయధాన్యాలు తీసుకున్నందువల్ల ప్రత్యేకంగా గుండెజబ్బుల ముప్పు తగ్గుతుందా అన్న అంశంపై జరిగిన ఈ అధ్యయనం ఫలితాలను అడ్వాన్సెస్ ఇన్ న్యూట్రిషన్లో ప్రచురించారు.
కాయధాన్యాలు తీసుకున్నందువల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గే అవకాశం ఉంది. అలాగే రక్తపోటు, స్థూలకాయం ముప్పు తగ్గే అవకాశం కూడా ఉంది. అయితే ఈ మాట మరీ నికరంగా చెప్పలేం అని అధ్యయనం తేల్చింది. ఒక ఆరోగ్యకరమైన ఆహార పదార్ధం తీసుకునేవారు అన్ని రకాల మంచి ఆహార పదార్ధాలనూ తీసుకుంటారు. పైగా అలాంటివారు రోజూ వ్యాయామం కూడా చేసే అవకాశం మెండుగా ఉంటుంది. ఈ కారణం వల్ల ఫలానా ఆహార పదార్ధం వల్ల ఫలానా ఫలితం వచ్చిందని తేల్చలేం. ఏది ఏమైనా కాయధాన్యాలు మంచి ఆహారం కిందకే వస్తాయి కాబట్టి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది అని అధ్యయనం సూచించింది.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.