మళ్లీ దీక్ష అంటున్న అన్నా హజారే

2019 జనవరి 30 లోగా లోక్ పాల్ ను కేంద్రం నియమించని పక్షంలో మళ్లీ నిరాహారదీక్ష, ఆందోళన తప్పదని సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు. ఈ మేరకు అన్నా శనివారం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) సహాయమంత్రి జితేంద్ర సింగ్‌కు లేఖ రాశారు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తల నియామకంపై కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని అన్నా విమర్శించారు.

తొలుత ఈ ఏడాది మార్చి 23న అన్నా నిరాహారదీక్ష చేశారు. ఆయన డిమాండ్ నెరవేరస్తామని హామీ ఇస్తూ పీఎంవో లిఖితపూర్వకంగా తెలపడంతో దీక్ష విరమించుకున్నారు. అక్టోబర్ 2 వరకు గడువు విధిస్తున్నట్టు ప్రకటించారు. గడువు తీరినా కేంద్రం స్పందించకపోవడంతో తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్షకు సిద్ధమయ్యాననీ చెప్పారు. తాజాగా కేంద్రానికి మరో అవకాశం ఇస్తున్నామనీ.. జనవరి 30లోగా తమ డిమాండ్ నెరవేర్చని పక్షంలో ఆందోళన చేపడతామని ఆయన స్పష్టం చేశారు.