Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటంతో చదువుల నిమిత్తం మణిపూర్ వెళ్లిన ఏపి, తెలంగాణ విద్యార్ధులు అక్కడ చిక్కుకుపోయారు. ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యార్ధులు క్షేమ సమాచారం కోసం వారి తల్లిదండ్రులు కంగారుపడుతున్నారు. ఇంఫాల్ నిట్ లో చిక్కుకున్న తమ పిల్లలను త్వరగా తీసుకురావాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

తెలుగు విద్యార్ధులను క్షేమంగా తీసుకువచ్చేందుకు ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నాయి. హెల్ప్ లైన్ లను ఏర్పాటు చేశాయి. మణిపూర్ ప్రభుత్వంతో ఏపి, తెలంగాణ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. తెలంగాణకు చెందిన 250 మంది, ఏపికి చెందిన 150 మంది మణిపూర్ లోని పలు యూనివర్శిటీల్లో చదువుతున్నట్లుగా అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసిఆర్ ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక విమానాల ద్వారా విద్యార్ధులను క్షేమంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంఫాల్ నిట్ లో చదువుతున్న విజయవాడకు చెందిన విద్యార్ధిని జీవన శ్రీ ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఇంఫాల్ నిట్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.