నటీనటులు: జ్యోతిక, భాగ్యరాజ్, పార్తీబన్
నిర్మాత: సూర్య
దర్శకత్వం: జేజే ఫెడ్రిక్
రన్ టైం: 2 గంటల 3 నిముషాలు
విడుదల తేదీ: మే 29, 2020
ఓటిటి ప్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్
తమిళ నటి జ్యోతిక నటించిన కొత్త సినిమా ‘పొన్మగళ్ వందాళ్’ ఒటీటీ ప్లాట్ ఫాంలో నేరుగా విడుదలైన మొట్టమొదటి భారతీయ సినిమా. అమెజాన్ ప్రైంలో నేడు విడుదల అయింది. మే 21న ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సినీ ప్రేక్షకులందరి ఆసక్తినీ తన వైపు తిప్పుకున్న ఈ చిత్రం ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
కథ: పదిహేను సంవత్సరాల క్రితం ఎన్ కౌంటర్ కు గురైన సైకో జ్యోతి కేసును న్యాయవాది వెన్బ (జ్యోతిక), పిటిషన్ పేతురాజ్ (భాగ్యరాజ్) సాయంతో తిరిగి ఓపెన్ చేస్తుంది. కేసులో ప్రమేయం ఉన్న వారిని తన సామర్ధ్యంతో కోర్టు ముందు సాక్ష్యాలతో ఎలా నిలబెట్టిందనేది తెలుసు కోవాలంటే సినిమా చూడాల్సిందే.
తెర మీద స్టార్స్: ఒక పక్క చెక్కు చెదరని సకల్పంతో న్యాయం కోసం పరితపించే అడ్వకేట్ గా, మరో వైపు తమ కూతురి జీవితం కోసం పరితపించే తల్లి పాత్రలో.. ఇలా రెండు భిన్నమైన పాత్రలో జ్యోతిక అద్భుతంగా నటించారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా జ్యోతిక అభిమానులు మాత్రం పండగ చేసుకుంటారు. తనకు ఎదురుగా వాదించే అడ్వకేట్ రాజరత్నం (పార్తీబన్) తో పోటీగా నటించారు. భాగ్యరాజ్, ప్రతాప్ పోతన్, వినోదిని, త్యాగరాజన్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారని చెప్పవచ్చు.
తెర వెనుక ప్రతిభ : సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో పూర్తి మార్కులు కొట్టేస్తారు. దర్శకుడిగా మరింత భవిష్యత్తు ఉండాలంటే అతను చెప్పాలనుకున్న దానిని వదిలిపెట్టకుండా సినిమాను మలచటంలో దృష్టి పెట్టాలి. నటుడు సూర్య నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ: చిన్నపిల్లలపై లైంగిక ఆకృత్యాలను ముఖ్యంగా చర్చించిన ఈ సినిమాను నూతన దర్శకుడు ఫ్రెడ్రిక్ సాధారణ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లా కాకుండా కోర్టు రూమ్ డ్రామాగా మలిచిన విధానం అదుర్స్. వాస్తవాలను దాచేయటానికి ప్రయత్నించే ఈర్ష్య నిండిన నేరపూరిత పురుషులు, న్యాయాన్ని మింగేసే రాబందులు, క్రూరులైన పోలీసులతో ఒక ధీరురాలైన మహిళా అడ్వకేట్ చేసే పోరాటాన్ని చూపటంలో కొంత మేరకే సఫలమయ్యాడు. అయితే పిల్లలపై జరిగే ఆకృత్యాలను అంత హింసాపూరితంగా చూపటం అవసరమా అనిపిస్తుంది. కొన్ని కొన్ని చోట్ల ‘ఆహా’ అనిపించిన దర్శకుడు ఆ అనుభూతిని ఎక్కువ సేపు ఉంచలేకపోయారు. ఇంటర్వెల్ ప్లాట్, క్లైమాక్స్ ట్విస్ట్ పకడ్బందీగా రాసుకున్న దర్శకుడు ప్రతి విషయాన్ని హృదయాన్ని పిండేసే భావోద్వేగంలో నింపేయాలనే ప్రయత్నంలో లాజిక్కులకు దూరంగా కొన్ని చిక్కు ప్రశ్నలను వదిలేసాడు.