పక్కాలెక్కలతోనే పవన్ కల్యాణ్ “గ్రేటర్ “ప్రచారానికి దూరం!!

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొనకపోవడంపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ముందుగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత పొత్తు ధర్మమంటూ బీజేపీకి మద్దతు ప్రకటించారు. జనసైనికులు,తన అభిమానులు అందరూ ఒక్క ఓటు కూడా పొల్లు పోకుండా బిజెపికి వేసేయాలని ఆయనొక పిలుపునిచ్చి సరిపెట్టుకున్నారు.ఆ తర్వాత ఏదో పెద్ద పనున్నట్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు.త్వరలో ఉపఎన్నిక జరగనున్న తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి జనసేన పోటీ చేస్తుందని బీజేపీ మద్దతు ఇవ్వాలని ఆయన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను కోరినట్టు వార్తలు వచ్చాయి.అయితే నడ్డా నుండి ఆ మేరకు హామీ వచ్చిందో లేదో కూడా తెలియదు.ఢిల్లీ నుండి వచ్చేశాక కూడా మూడు రోజులు సమయం ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ బీజేపీ పక్షాన గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు.

పోటీ నుండి జనసేన వైదొలగడమే జనసైనికులకు నచ్చలేదు.కనీసం ప్రచారంలో నయినా తమ పవర్‌ స్టార్ పాల్గొంటారేమోనని వారు ఎదురు చూశారు.అదీ జరగలేదు.దీంతో జనసైనికులు నిరాశ నిస్పృహలకు గురయ్యారని చెప్పవచ్చు.అసలు ఎందుకు పవన్ కల్యాణ్ ఈ ప్రచారంలో పాల్గొన్న లేదనడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి.తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో పవన్ కల్యాణ్కు సత్సంబంధాలే ఉన్నాయి.గతంలో పవన్ కల్యాణ్ సినిమా ఒకదానికి కెసిఆర్ ప్రభుత్వం అవసరమైన సాయం అందజేసిందని టాక్.అదీగాక ఈ మధ్య టాలీవుడ్ ప్రముఖులు కెసిఆర్ను కలిసి కొన్ని వరాలు కోరగా ఆయన ఇచ్చారు.ఈ టాలీవుడ్ ప్రతినిధి బృందానికి పవన్ కల్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి నాయకత్వం వహించారు.

ఇప్పుడు పవన్ కల్యాణ్ కెసిఆర్కు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేయటం అనేది చిరంజీవికి ఇబ్బందికరంగా మారుతుందన్నది ఒక లెక్క.మరోవైపు పవన్ కల్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు.ఇప్పుడు గనుక కెసిఆర్తో సున్నం పెట్టుకుంటే అది తన సినిమాల విడుదలతో పాటు ఇతరత్రా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని,ఇదంతా ఎందుకొచ్చిన గొడవని ఆయన తెలివిగా ఎన్నికల ప్రచారాన్ని విరమించుకున్నారని చెబుతున్నారు.తాను ప్రచారం చేసినప్పటికీ రేపటి ఎన్నికలలో బిజెపి జనసేన కూటమి ఓడిపోతే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో కూడా తనపై ఉంటుందని పవన్ కల్యాణ్ తలపోశారని జనసేన వర్గాలు అంటున్నాయి.అయితే రాజకీయ పార్టీ అన్నాక ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కనీసం ప్రచారానికి కూడా వెళ్లకపోవడం అనేది పవన్ కల్యాణ్ పరంగా చూస్తే పెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పాలి.