సింధు రికార్డు..ఈసారి ‘తేజస్‌’లో

Photo credit: ANI

బెంగళూరు: భారత ఏస్ షట్లర్ పీవీ సింధు స్వదేశంలో తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను నడిపారు. తేజస్‌కు కో-పైలట్‌గా వ్యవహరించారు. తేజస్ యుద్ధ విమానానికి కో-పైలట్‌గా పనిచేసిన తొలి మహిళగా పీవీ సింధు రికార్డుల్లోకెక్కారు. హెచ్ఏఎల్ రూపొందించిన రెండు సీట్లు కలిగిన ఈ విమానంలో ఆమె  నింగిలోకి దూసుకెళ్లారు.

అనంతరం సింధు మాట్లాడుతూ.. తేజస్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం రావడం తనకు దక్కిన అరుదైన గౌరవమని అన్నారు. తనకు గొప్ప అనుభవమని.. విమానాన్ని నడిపేందుకు అవసరమైన సూచనలను కెప్టెన్ తనకు ఇచ్చారని వివరించారు.

వింగ్ కమాండర్‌తోపాటు ఆమె విమానంలో ప్రయాణించారు. ‘సింధు చాలా తొందరగా ఎత్తును, వేగాన్ని అందుకున్నారు. ఓ డ్యాం వద్ద మేము కొన్ని దాడులు చేశాం. 5 నిమిషాలుపాటు జరిగిన దాడిలో సింధు కూడా భాగస్వామి అయ్యారు’ అని ఎయిర్‌ఫోర్స్ అధికారి తెలిపారు.

ఎయిర్ షోలో నాలుగో రోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఏరో ఇండియా విమెన్స్‌ డే వేడుకలను నిర్వహించింది. యెలహంకలోని ఎయిర్ బేస్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో మరో ముగ్గురు మహిళా ఐఏఎఫ్ ఫైటర్ పైలట్లు కూడా హాక్-1 విమానాన్ని నడిపారు.

మహిళా దినోత్సవంలో భాగంగా వైమానిక రంగంలో మహిళలు సాధించిన అద్భుతమైన విజయాలను ఏరో ఇండియాలో ప్రదర్శిస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 25న ఈ ఎయిర్ షో ముగియనుందని అధికారులు తెలిపారు.