TDP Janasena First List: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్ధుల ఎంపికలో వైసీపీ ముందంజలో ఉంది. ఇప్పటికే సుమారు 70 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఖరారు చేసింది వైసీపీ. కానీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేనకు సంబంధించి అభ్యర్ధుల జాబితా ఇంత వరకూ విడుదల కాకపోవడంతో ఆ పార్టీ నేతల్లో ఓ టెన్షన్ వాతావరణం నెలకొంది.
ప్రతి నియోజకవర్గం నుండి ఇద్దరు ముగ్గురు చొప్పున ఆశావహులు ఉండటం, జనసేన పొత్తు నేపథ్యంలో సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై ఇరుపార్టీల అధినేతలు ఇటీవల దీనిపై కసరత్తు పూర్తి చేశారు. జనసేన ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలి, బీజేపీకి పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది తదితర అంశాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఒక అంచనాకు వచ్చినట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తొంది.
బీజేపీతో పొత్తులపై ఇంకా క్లారిటీ రానందున ఆ పార్టీ ఆశించే స్థానాలను పక్కన పెట్టి ఇతర నియోజకవర్గాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాలోచనలు జరిపి, సామాజిక సమీకరణాలు, సర్వే రిపోర్టుల ఆధారంగా గెలుపు అవకాశాల ఆధారంగా అభ్యర్ధుల ఎంపికపై తుది కసరత్తు పూర్తి చేశారని అంటున్నారు. తొలి జాబితాను వారం రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి తొలి జాబితా విడుదల చేయనున్నారని తెలుస్తొంది.
తొలి జాబితాలో టీడీపీకి సంబంధించి సుమారు 50 నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటిస్తారని, అదే విధంగా జనసేనకు సంబంధించి 15 నుండి 20 స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీలో ప్రస్తుతం 18 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, ఒకటి రెండు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని, ఒక వేళ అక్కడ కూడా ఏకాభిప్రాయం కుదిరితే మొత్తంగా సిట్టింగ్ లకు సీటు దక్కవచ్చని అంటున్నారు.
ఈ నెల 20వ తేదీలోపుగా మొదటి జాబితా విడుదల చేయాలన్న ఆలోచనలో ఆ పార్టీలు ఉన్నాయని సమాచారం. తొలి జాబితాను టీడీపీ, జనసేన సంయుక్తంగా విడుదల చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారుట. అలా చేసినట్లయితే క్యాడర్ లో అనుకూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి అభ్యర్ధుల ప్రకటన విడుదల కాకపోవడంతో ఆ పార్టీలు జోష్ గా జనాల్లోకి వెళ్లలేకపోతున్నారు. టీడీపీ, జనసేనకు సంబంధించి తొలి జాబితా విడుదల చేసిన తర్వాత బీజేపీతో పొత్తుపై దృష్టి పెట్టి తదనుగుణంగా రెండవ జాబితాను రెడీ చేస్తారని అంటున్నారు.
Medaram Jatara: మేడారం జాతరలో బంగారం (బెల్లం)నే భక్తులు నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారంటే..?