బీజేపీలోకి చేరిక‌ల వ‌ర‌ద‌… ఇప్పుడు ఆ ముఖ్య నేత వంతు

తెలంగాణ‌లో ఇప్పుడు అంద‌రి చూపు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు అనేకంటే ఇదే స‌మ‌యంలో పార్టీ మారుతున్న నేత‌లపై ప‌డుతోంది.

 

ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీకి మారుతున్న నేత‌ల లెక్క తీస్తే ప్ర‌ధానంగా బీజేపీలో చేరిక‌ల సంఖ్యే ఎక్కువ‌గా ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున షాక్ త‌గులుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది.

ఆ ముఖ్య నేత త‌న‌యుడు…

దుబ్బాక విజయంతో ఊపుమీదున్న బీజేపీ… గ్రేటర్‌లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది.. దీనిలో భాగంగా.. బీజేపీ అగ్రనేతలు ప్రచారానికి రప్పిస్తోంది. అదే స‌మ‌యంలో పెద్ద ఎత్తున చేరిక‌ల‌ను ప్రోత్సహిస్తోంది. తాజాగా గోషామహల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో విక్రమ్ గౌడ్ చేరారు. మ‌రోవైపు పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇదే జాబితాలో మ‌రో ఇద్ద‌రు నేత‌లు ఉన్న‌ట్లు స‌మాచారం.

యోగీ ఆదిత్యానాథ్ ఎంట్రీతో…

గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీ అగ్రనేతలతో పాటు.. కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు కూడా వస్తున్నారు.. ఇప్పటికే.. తమ తమ రాష్ట్రాల నుండి కార్యకర్తలను తీసుకొచ్చిన విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ అగ్రనేతలు ప్రచార ప‌ర్వం కొన‌సాగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు గ్రేటర్‌ ప్రచారంలో నేడు పాల్గొననున్నారు. హైదరాబాద్‌కు విచ్చేస్తున్న‌ ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేయ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న యోగీ ఆదిత్యనాద్ మల్కాజ్‌గిరి పార్లమెంటు, పాతబస్తీలో రోడ్ షో చేయనున్నట్లు చెబుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జీడిమెట్ల ఉషా ముళ్ళపూడి ఆసుపత్రి నుంచి 5 గంటల వరకు ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు రోడ్ షో ఉండనుంది. సాయంత్రం 6 గంటల నుంచి పాతబస్తీలోని శాలిబండ, లాల్ దర్వాజలో పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొననున్నారు. రాత్రి 8.30కు బేగంపేట నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. మ‌రోవైపు, అమిత్ షా ప్ర‌చారంపై కూడా పార్టీ నేత‌లు భారీ ఆశ‌లు పెట్టుకున్నారు.

 

SHARE