జగన్ అనుకుంటే జరగాల్సిందే మరి..! ఆ దిశగానే అడుగులు..!!

మడమ తిప్పని నేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పేరు. ఆయన తనయుడిగా వైఎస్ జగన్ కూడా అదే పేరు తెచ్చుకున్నారు. జగన్ కు ఎవరిపైనైనా ఓసారి నమ్మకం కలిగితే మరచిపోరు అనే పేరు కూడా ఉంది. వైఎస్ మరణం తర్వాత తనతో వచ్చిందెవరు, నమ్మకంగా ఉండిపోయింది ఎవరు.. అనే లెక్కలు కూడా జగన్ వద్ద ఉన్నాయంటారు. జగన్ సీఎం అయ్యాక కొందరికి దక్కిన పదవులు ఇందులో భాగమే అంటారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా జగన్ ప్రకటించిన డాక్టర్ గురుమూర్తి కూడా ఆకోవలోకే వస్తారని అంటున్నారు. పాదయాత్రలో జగన్ కు ఫిజియోగా ఆసాంతం ఉన్న గురుమూర్తిపై ఆయనకు ఏర్పడిన నమ్మకమే ఎంపీ అభ్యర్ధిగా నిలపడానికి కారణమని తెలుస్తోంది.

cm jagan steps towards his mark
cm jagan steps towards his mark

గురుమూర్తిపై జగన్ కు గురి..

వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు మరణించడం.. ఆయన సతీమణి ఎంపీగా పోటీ చేయడానికి నిరాకరించడంతో.. జగన్ ఆలోచన మారినట్టుగా తెలుస్తోంది. ఆయన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ఒప్పించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జగన్ కు అదే జిల్లాకు చెందిన గురుమూర్తి పేరును సూచించడం జరిగిందని అంటున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో జగన్ కు ఆయన అందించిన సహకారం, సులభంగా నడిచేందుకు చేసిన వైద్యం జగన్ ను ఆకర్షించాయని అంటున్నారు. దీంత జగనే గురుమూర్తి పేరు ప్రస్తావించడంతో నాయకులెవరూ మారు మాట్లాడలేదని తెలుస్తోంది. గురుమూర్తి గెలుపు బాధ్యత మీదే అని కూడా చెప్పేసారట. పాదయాత్రలో జగన్ తోనే ఉన్నా.. జగన్ సీఎం అయ్యాక కలవడానికి ఇబ్బందులు పడ్డ గురుమూర్తికి ఒక్కసారిగా బూరెల బుట్టలో పడ్డట్టైందని అంటున్నారు.

తన మార్క్ ఉండేలా జగన్ ప్లాన్..

జగన్ కూడా పార్టీలో దాదాపు తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నారని అంటున్నారు. సీనియర్లకు పదవులు అప్పగించి, తనతో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో.. కొత్తవారిని ప్రోత్సహించడం, యువతో పార్టీని నింపడం.. తన సుదీర్ఘ రాజకీయాలకు అంతే ముఖ్యమని భావిస్తున్నారట. ప్రస్తుతం జగన్ పార్టీలో గెలిచిన వారిలో సీనియర్లు ఎందరు ఉన్నారో.. యువత కూడా అలానే ఉన్నారు. వీరంతా జగన్ హవాతో గెలిచినవారే కావడం విశేషం. నందిగం సురేశ్, గొడ్డేటి మాధవి.. ఇలా పార్టీలో యువరక్తంతో ఉంది. ప్రజల్లో కూడా వైసీపీపై యువత పార్టీ అనే భావం కలగడానికి జగన్ ఆలోచనే కారణమని తెలుస్తోంది. అందుకే గురుమూర్తిని కూడా గెలిపించుకుని ఆ ముద్రను మరింత పటిష్టం చేసుకోవాలని జగన్ ఆలోచనగా చెప్తున్నారు.