‘బిజెపి కంగారు పడుతున్నట్లుంది’!

 

ప్రియాంకా గాంధీ రాజకీయ ప్రవేశంతో భారతీయ జనతా పార్టీ  కాస్త కంగారుపడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్ అమేధీ పర్యటనలో ఉండగా బుధవారం ప్రియాంకను తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు ప్రకటన వెలువడింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్‌గా జ్యోతిరాదిత్య సింధియాను నియమించారు.

అమేధీలో మీడియాతో మాట్లాడిన రాహుల్ ఆ ఇద్దరినీ ఏదో రెండుమూడు నెలల కోసం ఉత్తరప్రదేశ్ పంపడం లేదని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ప్రియాంక పోటీ చేస్తారా అని ప్రశ్నించినపుడు, ‘పోటీ చేసేదీ లేనిదీ ఆమె ఇష్టం. అసలు విషయం ఏమంటే మేము వెనకడుగు వేయం, అది ఉత్తరప్రదేశ్‌గానీ, గుజరాత్ గానీ’ అన్నారు. ప్రియాంకతో కలిసి పనిచేయడానికి ఆనందంగా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ఆమె సమర్ధురాలు, కష్టించి పని చేయగలదు’ అన్నారాయన.

ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమైన మరో రెండు రాజకీయ పక్షాలు..సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ విషయంలో రాహుల్ ఆచితూచి స్పందించారు. అఖిలేష్, మాయావతి కలిసి కాంగ్రెస్‌ను పట్టించుకోక పోవడానికీ ప్రియాంకకు పార్టీలో క్రియాశీల పాత్ర ఇవ్వడానికీ సంబంధం లేదని ఆయన అన్నారు. ‘ఎక్కడ కుదిరితే అక్కడ ఆ రెండు పార్టీలతో సహకరించేందుకు సిద్ధమే. వారు మా శత్రువులు కారు. మాకు ఉన్నది ఉమ్మడి శత్రువు’, అని రాహుల్ పేర్కొన్నారు.

 

‘ఆ ఇద్దరినీ రెండు మూడు నెలల కోసం ఉత్తరప్రదేశ్ పంపడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుక తీసుకువెళ్లేందుకు పంపుతున్నాను… పేదలు, యువత, రైతులు వీరి సంక్షేమం కోసం పోరాడే కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లడం కోసం’, అని రాహుల్ పేర్కొన్నారు.