టీడీపీలో ఉండేదెవరు..? ఊడేదెవరు..!? (పార్ట్ – 2 )

తెలుగు దేశం పార్టీ కోటలు పగలకొట్టాలి.. పునాదులు పీకేయాలి.. చంద్రబాబుని బలహీనం చేయాలి.. లోకేష్ ని ఒంటరిని చేయాలి.. అసలు ఆ పార్టీ అనేదే ఏపీలో కనిపించకూడదు..!! ఇవన్నీ జగన్ లక్ష్యాలు..!! మరి ఎమ్మెల్యేలను ఎంత వరకు లాగేస్తారు..? ఇప్పటికే నలుగురు జంపయ్యారు. మిగిలిన 19 మందిలో ఎవరు వెళ్తారు..? ఎవరు ఉంటారు..? అనేది ఒకసారి చూద్దాం..!!
Note ; ఈ కథనం మొదటి పార్ట్ ఈ రోజు ఉదయం పోస్ట్ చేసాం. ఆ కథనంలో 9 మంది ఎమ్మెల్యేల గురించి రాశాం, మిగిలిన పదిమంది గురించి ఈ కథనంలో..!!

రామానాయుడు (పాలకొల్లు) – నిమ్మల రామానాయుడు టీడీపీలో కీలకంగా ఎదిగారు. వరుసగా రెండు సార్లు గెలవడం, పార్టీలో కూడా ప్రాధాన్యత ఇస్తుండడంతో ఈయన టీడీపీలో కంఫర్ట్ గా ఉన్నారు. జగన్ పైనా, ఆ పార్టీపైనా విరుచుకుపడుతున్నారు. టీడీపీలో యాక్టీవ్ గా ఉన్నా ఈయన పార్టీ మారడం అసాధ్యమే. ఒకరకంగా పశ్చిమ గోదావరిలో చంద్రబాబు నమ్మిన బంటు ఈయన.

మంతెన రామరాజు (ఉండి) – టీడీపీకి అత్యధిక పట్టు ఉన్న నియోజకవర్గం ఇది. 1983 అంటే టీడీపీ ఆవిర్భావం నుండి కేవలం ఒకేసారి (2004 ) మాత్రమే ఇక్కడ టీడీపీ ఓడింది. ఈ ఎమ్మెల్యే పార్టీ మారితే రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఈయనకు టీడీపీలో కంఫర్ట్ గా ఉన్నారు. రాజకీయంగా పెద్దగా అందుబాటులో లేకుండా సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. పార్టీ మారే అవకాశాలు ఏ మాత్రం లేవు.

Read Also >> టీడీపీలో.., ఈ 19 మందిలో ఉండేదెవరు..? ఊడేదెవరు..?? (పార్ట్ – 1 )

గద్దె రామ్మోహనరావు (విజయవాడ తూర్పు) – పార్టీకి, చంద్రబాబుకి అత్యంత కంకణ బద్ధుడిగా ఉన్నారు. సామజిక వర్గం, పార్టీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రెండు దశాబ్దాల నుండి రాజకీయం చేస్తున్నారు. పార్టీ మారే అవకాశాలే లేవు.

సత్య ప్రసాద్ (రేపల్లె) – వరుసగా రెండు సార్లు గెలిచి టీడీపీలో కీలక సభ్యుడిగా మారారు. పార్టీకి ప్రస్తుతం అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. సొంత వ్యవహారాలు, వ్యాపారాలతో హైదరాబాద్ లోనే ఎక్కువగా గడుపుతున్నారు. రెండు నెలల కిందట వైసీపీ లో చేరేందుకు ప్రాధమిక దశలో చర్చలు జరిగినప్పటికీ విఫలమయ్యాయని పుకార్లు ఉన్నాయి. ఈయన పార్టీ మారే అవకాశాలను కొట్టి పారేయలేం.

ఏలూరి సాంబశివరావు (పర్చూరు) – వరుసగా రెండుసార్లు గెలిచి సామాజికవర్గానికి, ఆ పార్టీకి కీలకంగా ఎదిగారు. బాబుతోనూ, లోకేష్ తోనూ సన్నిహితంగా ఉంటారు. రెండు నెలల కిందట ఈయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది, అయితే ఈయన దాన్ని ఖండించారు. జిల్లాలో అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయి, అదే క్రమంలో ఈయనకి కొన్ని అవసరాలు ఉన్నాయి. కానీ చర్చల దశలోనే చేరిక ఆగింది. ప్రస్తుతం అయితే పార్టీ మారే అవకాశాలు లేవు. కానీ మరోసారి చర్చలు జరిగి, సఫలమయితే వెళ్లిపోవచ్చు.

Read Also >> టీడీపీలో.., ఈ 19 మందిలో ఉండేదెవరు..? ఊడేదెవరు..?? (పార్ట్ – 1 )

గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి) – జిల్లాలో, ఆ సామాజికవర్గంలో సీనియర్ ఎమ్మెల్యే. గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే పార్టీలోకి వచ్చారు. ఈయనకు గ్రానైట్ వ్యాపారాలు ఉన్నాయి. ప్రభుత్వం దాడులు చేసి రూ. 300 కోట్ల వరకు ఫైన్ వేశారు. ఆయన లీజులు రద్దు చేసారు. విషయం కోర్టు వరకు వెళ్ళింది. ఇటు అధికార పార్టీ ఒత్తిళ్ల నేపథ్యంలో టీడీపీ, సొంత సామాజికవర్గ పెద్దల నుండి కొంతమేరకు న్యాయ సహాయం పొందారు. కొద్ది నెలలుగా చాలా ఒత్తిడి, ఇబ్బందుల మధ్య ఉంటున్నారు. చర్చలు జరుగుతున్నాయి. పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. ఈయన టీడీపీ, చంద్రబాబు కంటే జగన్ కీ, ఆ కుటుంబానికి కావాల్సిన వ్యక్తి.

డీబీవి స్వామి (కొండపి) – స్వామి తొలి నుండి టీడీపీకి కంకణబద్ధుడిగా ఉన్నారు. జిల్లాలో టీడీపీ పెద్దలు దామచర్ల కుటుంబానికి కావాల్సిన వ్యక్తి. స్వతహాగా వైద్యుడైన స్వామిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి, 2009 లో పోటీకి దించింది ఆ కుటుంబమే. 2014 , 2019 లో వరుసగా రెండు సార్లు గెలవడంలో దామచర్ల కుటుంబం సహా… టీడీపీ అనుకూల సామజిక వర్గ సాయం, కష్టం ఉంది. వారిని కాదు అనుకుని స్వామి పార్టీ మారే అవకాశాలు లేవు. ప్రస్తుతం కూడా వైసీపీపై ధాటిగా విమర్శలు చేస్తూ, టీడీపీ వాయిస్ ని బలంగా వినిపిస్తున్నారు. పార్టీ మారే అవకాశాలే లేవు.

పయ్యావుల కేశవ్ (ఉరవకొండ) – అనంతపురం జిల్లాలో టీడీపీకి కీలక నేత. పార్టీలో మొదటి నుండి ఉన్నారు. రెండు దశాబ్దాలకు పైగా టీడీపీలోనే ఉన్నారు. సామాజికవర్గానికి, పార్టీకి అత్యంత నమ్మకస్థుడు. పార్టీ మారే అవకాశాలు లేనే లేవు.
* ఇక మిగిలిన ఇద్దరూ నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు.

Read Also >> టీడీపీలో.., ఈ 19 మందిలో ఉండేదెవరు..? ఊడేదెవరు..?? (పార్ట్ – 1 )