`ఆట` లాంటి డ్యాన్స్ షోతో ఆకట్టుకున్న ఓంకార్ దర్శకుడిగా మారి చేసిన తొలి ప్రయత్నం `జీనియస్` పెద్దగా సక్సెస్‌ను ఇవ్వలేదు. అయితే హారర్ కామెడీ జోనర్లో ఈయన తెరకెక్కించిన `రాజుగారిగది` మంచి సక్సెస్‌ను సాధించింది. దీంతో పలు హారర్ కామెడీ చిత్రాలకు ఓంకార్ ఓ రకంగా కొత్త దారి చూపించాడనే చెప్పాలి. తర్వాత ఓంకార్ దర్శకత్వంలో `రాజుగారిగది 2` సినిమా కూడా రూపొందింది. ఇందులో నాగార్జున, సమంతలు నటించారు. ఇది కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాకపోయినా డైరెక్టర్‌గా ఓంకార్‌కి మంచి పేరునే తెచ్చిపెట్టింది. తాజాగా ఈ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీలో వచ్చిన మరో చిత్రం `రాజుగారిగది 3`. ఇందులో తొలి రెండు పార్టుల్లో నటించిన అశ్విన్‌బాబు హీరోగా నటించగా, అవికాగోర్ హీరోయిన్గా నటించింది. మరి ఈ సినిమా ఓంకార్‌కి ఎలాంటి విజయాన్ని తెచ్చిపెట్టిందో చూడాలంటే ముందుగా కథలోకి వెళదాం..
బ్యానర్: ఓక్ ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: అశ్విన్ బాబు, అవికాగోర్, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, అజయ్‌ఘోష్, ఊర్వశి, హరితేజ తదితరులు
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేశ్
సంగీతం: షబీర్
ఎడిటర్: గౌతంరాజు
సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కల్యాణి చక్రవర్తి
దర్శకత్వం: ఓంకార్
కథ:
తల్లిదండ్రులు లేకపోవడంతో మావయ్య(అలీ) సాయంతో అశ్విన్(అశ్విన్‌బాబు) పెరిగి పెద్దవుతాడు. ఆటోనడుపుతుంటాడు. అయితే రోజు తాగి చుట్టు పక్కలవారికి పెద్ద తలనొప్పిగా మారతాడు. అదే సమయంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్‌గా పనిచేసే మాయ(అవికాగోర్) కేరళలోని భూత మాంత్రికుడు గరుడపిళ్లై కుమార్తె. ఈమెను ఎవరైనా ప్రేమించినా, వెంటపడినా ఓ దెయ్యం వారిని చితకబాదుతుంటుంది. ఆమె పనిచేసే హాస్పిటల్‌లోని డాక్టర్ శశి(బ్రహ్మీజి) కూడా దెయ్యం దగ్గర దెబ్బలు తింటాడు. ఇతను అశ్విన్ ఉండే కాలనీలోనే ఉంటాడు. అశ్విన్ బాధ నుండి తప్పించుకోవాలంటే మాయకి, అశ్విన్‌కి మధ్య ప్రేమ పుట్టించాలనుకుంటాడు. తను వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. అయితే చివరికి దెయ్యం చేతిలో అశ్విన్ దెబ్బలు తింటాడు. చివరకు తన ప్రేమ కోసం మాయను కలవడానికి కేరళ వెళ్లిన అశ్విన్‌కి తెలిసే అసలు నిజం ఏంటి? అశ్విన్, మాయలు ఒక్కటయ్యారా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
నటీనటుల విషయానికి వస్తే అశ్విన్ ప్రధానంగానే సినిమా సాగుతుంది. అశ్విన్ గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో నటన పరంగా బాగానే చేశాడు. ఇక అవికాగోర్ తన గత చిత్రాలతో పోల్చితే సన్నబడింది. తన పాత్రలో చక్కగా నటించింది. కాసేపు దెయ్యంగా కూడా నటించి ఆకట్టుకుంది. ఫస్టాఫ్‌లో శివశంకర్, ప్రభాస్ శ్రీను, హరితేజ, బ్రహ్మాజీ, అలీ, అశ్విన్‌లు నవ్వించే ప్రయత్నం చేశారు. ఇది పెద్దగా వర్కవుట్‌కాలేదు. ఫస్టాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే అశ్విన్, అలీ, ధనరాజ్, అజయ్ ఘోష్, ఊర్వశి పాత్రలు తమదైన నటనతో ఆకట్టుకున్నాయి. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే కామెడీ పార్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక సాంకేతికంగా చూస్తే షబీర్ సంగీతంలో మ్యూజిక్ సాహిత్యాన్ని వినపడనీయలేదు. నేపథ్య సంగీతం ఓకే. ఛోటా కె.నాయుడు కెమెరా పనితనం బావుంది. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ గొప్పగా వర్కవుట్ కాలేదు. రాజుగారి గది ఫ్రాంచైజీలోని తొలి రెండు పార్టుల కంటే ఈ పార్టులో పెద్దగా విషయమేమీ కనపడలేదు.
బోటమ్ లైన్:
రాజుగారిగది 3.. హారర్ లేదు.. కామెడీ కాస్త నవ్విస్తుంది
రేటింగ్: 2.25/5