Kushi Review: డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన “ఖుషి” సినిమా నేడు విడుదలయ్యింది. విజయ్ దేవరకొండ సమంత జంటగా కలిసి నటించిన ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో వరస పరాజయాలలో ఉన్న తమ అభిమాన హీరోకి “ఖుషి” రూపంలో హిట్టు పడటంతో అభిమానులు ఫుల్ ఆనందంగా ఉన్నారు. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం.
సినిమా పేరు: ఖుషి
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, వెన్నెల కిషోర్, మురళి శర్మ, రాహుల్ రామకృష్ణ, సచిన్ ఖేడేకర్, జయరాం తదితరులు.
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై రవిశంకర్
దర్శకత్వం: శివ నిర్వాణ
మ్యూజిక్ డైరెక్టర్: హేషామ్ అబ్దుల్ వహాబ్.
సినిమాటోగ్రఫీ: మురళి జి.
విడుదల తేదీ: సెప్టెంబర్ 1, 2023
పరిచయం:
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హిట్ అందుకుని దాదాపు మూడు సంవత్సరాలు పైగానే అయింది. గత ఏడాది వచ్చిన “లైగర్” భారీ అంచనాల మధ్య విడుదలయ్యి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలకు పైగా విజయ్ దేవరకొండ టైం కేటాయించడం జరిగింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేదు. ఇటువంటి క్రమంలో తన కెరీర్ కి ఎప్పుడు కలిసి వచ్చే రొమాంటిక్ జోనర్ ఎంచుకొని శివానిర్వాన దర్శకత్వంలో “ఖుషి” సినిమా చేశారు. విజయ్ దేవరకొండ కి హీరోయిన్ గా సమంత ఈ సినిమాలో నటించింది. నేడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ నెలలోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ హీరోయిన్ సమంత అనారోగ్యానికి గురి కావడంతో షూటింగ్ ఆగిపోయింది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి నుండి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి రెండు నెలల క్రితం మొత్తం కంప్లీట్ చేశారు. దాదాపు 8 నెలలు ఆలస్యంగా “ఖుషి” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా విడుదలైన పాటలు మరియు ట్రైలర్.. సినిమాకి మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మరి నేడు థియేటర్ లో విడుదలైన “ఖుషి” సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
స్టోరీ:
విప్లవ్ దేవరకొండ (విజయ్ దేవరకొండ) బిఎస్ఎన్ఎల్ అనే ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగిగా జాబ్ వచ్చిన టైములో తనకి పోస్టింగ్ కాశ్మీర్ లో ఇవ్వాలని కోరుతాడు. ఆ ప్రాంతాన్ని విప్లవ్ దేవరకొండ ఎంతగానో ఇష్టపడతాడు. కాశ్మీర్ అంటే ప్రశాంతమైన ప్రాంతమని తాను ఊహించుకుంటూ ఉంటాడు. అక్కడే పోస్టింగ్ వస్తాది. కాశ్మీర్ ప్రాంతంనీ ఎంతో ఇష్టపడుతూ ఉద్యోగం చేసుకుంటూ..అక్కడే ఆరా బేగం(సమంత) ని చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడిన తర్వాత తాను పాకిస్తాన్ నుండి వచ్చిన యువతీనని.. విప్లవ్ కి ఆరా బేగం చెప్పుకుంటుంది. తన తమ్ముడు తప్పిపోయాడని అతన్ని వెతుక్కుంటూ కాశ్మీర్ వచ్చినట్లు అబద్ధం చెబుతుంది. ఈ వెతుకులాట డ్రామా క్రమంలో ఆరా బేగం సోదరుడు కోసం పాకిస్తాన్ వెళ్లడానికైనా విప్లవ్ వెనుకాడడు. అయితే ఆ తర్వాత ఆరా బేగం బయోడేటా మొత్తం విప్లవ్ కి తెలిసిపోతుంది. ఆ అమ్మాయి అసలు పేరు ఆరాధ్య అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన అమ్మాయి అని మొత్తం వివరాలు తెలుసుకుంటాడు. ఆమె తండ్రి ప్రవచనకర్త చదరంగం శ్రీనివాసరావు (మురళి శర్మ) కుమార్తెనని తెలుసుకోవడం జరుగుతుంది. అయితే విప్లవ్ తో ఆరాధ్య ప్రేమలో పడిన తర్వాత తన కుటుంబం గురించి మొత్తం చెప్పేస్తది. మరోపక్క విప్లవ్ తండ్రి లెనిన్ సత్యం హైదరాబాదులో నాస్తిక వాదం సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాస్తికవాద అధ్యక్షుడిగా ఉన్న లెనిన్ కి చదరంగం శ్రీనివాసరావుకి గతంలోనే సిద్ధాంతపరమైన విభేదాలు ఏర్పడతాయి. ఈ క్రమంలో విప్లవ్.. ఆరాధ్య పెళ్లికి రెండు కుటుంబ పెద్దలు అడ్డు చెబుతారు. రెండు కుటుంబాలు భిన్నమైన ధోరణి గలవి కావడంతో.. పెళ్ళికి అనేక అడ్డంకులు ఏర్పడతాయి. ప్రవచనకర్త చదరంగం శ్రీనివాసరావు తన కూతురు ఆరాధ్యకి విప్లవ్ తో పెళ్లయితే జాతక పరంగా గొడవలు తప్పవని ముందుగా హెచ్చరిస్తాడు. అయినా గాని పెళ్లి చేసుకున్నా క్రమంలో నాస్తిక వాదం నమ్మే కుటుంబం మరోపక్క ఆచారాలు నమ్మే హీరోయిన్ కుటుంబానికి మధ్య పెళ్లయిన తర్వాత జరిగిన పరిణామాలే సినిమా.
విశ్లేషణ:
నాస్తిక వాదాన్ని నమ్మే హీరో కుటుంబం ఇంక సనాత ధర్మాన్ని ఆచరించే హీరోయిన్ కుటుంబం మధ్య జరిగిన సంఘర్షణని దర్శకుడు శివ నిర్వాణ అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట వివాహనంతరం ఏర్పడే విభేదాలు ఇంకా మనస్పర్ధలు.. వంటి వాటిని చాలా కామెడీ తరహాలో చూపించాడు. ఒకపక్క ఆచారాలు మరోపక్క నాస్తికత్వం అనే రెండు భిన్నమైన సిద్ధాంతాల నడుమ ప్రేమ జంట ప్రయాణాన్ని “ఖుషి” సినిమాలో ఎంటర్టైన్మెంట్ తరహాలో చూపించడం జరిగింది. చాలా సింపుల్ లైన్ అయినా గాని.. దానిలో నుండి మంచి ఎంటర్టైన్మెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో డైరెక్టర్ కథను నడిపించిన విధానం చాలా బాగుంటుంది. సినిమా ఫస్ట్ ఆఫ్ కాశ్మీర్ నేపథ్యంలో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి రొమాంటిక్ సన్నివేశాలతో విజయ్ దేవరకొండ..సమంత తమ నటనతో విశ్వరూపం చూపించారు. ఆరాధ్య ప్రేమను గెలుచుకోవటానికి కాశ్మీర్ లో విప్లవ్ చేసే ప్రయత్నాలు.. ఎంతో కామెడీనీ తలపిస్తాయి. సినిమాలో విజయ్ దేవరకొండ ఇంకా వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ … సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ లో మురళీ శర్మ కామెడీ బాగా పండింది. కామెడీతో పాటు కొన్ని భావోద్వేగాకరమైన సన్నివేశాలు సెకండ్ హాఫ్ లో ఉంటాయి. ముఖ్యంగా “అర్జున్ రెడ్డి” లోని సీన్స్ గుర్తు చేస్తూ విజయ్ దేవరకొండ.. రాహుల్ రామకృష్ణ మధ్య వచ్చే ఎపిసోడ్ చక్కటి కామెడీని పండించింది. పాటల చిత్రీకరణ.. సాంగ్స్ చాలా హైలెట్ గా నిలిచాయి. మురళీ శర్మ ఇంకా సచిన్ ఖేడ్ కర్ సెకండ్ హాఫ్ లో కీలకంగా నిలిచారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ దైన కామెడీ టైమింగ్ డైలాగులతో మెప్పించారు. పాటలతోపాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఎంతో ప్లస్ గా నిలిచింది. ఓవరాల్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమాగా ఖుషి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.