NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana BJP: వరుస వలసలు .. బీజేపీ స్వయంకృతాభిరాధమే(గా)..!

Share

Telangana BJP:  కర్ణాటక ఎన్నికల ముందు వరకూ తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న పరిస్థితి ఉండేది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం, చేష్టలు ఆ విధంగానే జరిగాయి. కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదిపింది. ఆ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేయడంతో బీఆర్ఎస్ సర్కార్ పై కేంద్రంలోని బీజేపీ దూకుడుగా ఉంటుందని భావించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర, నిరసన దీక్షలు చేస్తూ కేసిఆర్ సర్కార్ పై దూకుడుగా వ్యవహరిస్తూ గట్టి పోరాటమే చేశారు. ఇదే అదునుగా బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించడం రాజకీయ సంచలనం అయ్యింది. అయితే ఇది కేసిఆర్ వ్యూహంతో మిస్ ఫైర్ అయ్యింది. బీజేపీ కీలక నేతలను ఈ కేసులో నిందితులుగా చేర్చేందుకు కేసిఆర్ సర్కార్ వ్యూహాత్మక అడుగులు వేసింది. ఆ తరుణంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు గులాబీ బాస్. కేసుకు కౌంటర్ కేసు రాజీకి మార్గం అన్నట్లు అటు కవిత పై కేసు, ఇటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులు కోల్డ్ స్టోరేజ్ లో పడిపోయాయి.

కర్ణాటక ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ను బయటకు వచ్చిన పలువురు కీలక నేతలు బీజేపీలో చేరాలని భావించారు. ఆ నేతలతో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కూడా సంప్రదింపులు జరిపారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం, బీఆర్ఎస్ పై కేంద్ర బీజేపీ పెద్దల వైఖరిలో మార్పు రావడంతో బీజేపీ వైపు వెళ్తామనుకున్న బీఆర్ఎస్ మాజీ నేతలు కాంగ్రెస్ వైపుకు మళ్లారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాకపోయినా ఫరవాలేదు, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఫరవాలేదు కానీ కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాకూడదు అన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా వ్యవహరిస్తొందనేది విశ్లేషకుల వాదనగా ఉంది.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేసి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న రీతిలో తీసుకువచ్చిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అకస్మాత్తుగా తప్పించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నియమించడం ఆ పార్టీలోని చాలా మంది నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఈ పరిణామాలను కాంగ్రెస్ ఉపయోగించుకుంది. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని ప్రచారం మొదలు పెట్టింది. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తొందనీ విమర్శలు చేసింది.  దీంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అన్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఆ పార్టీలోని నాయకులు కూడా నమ్ముతున్నారు. దీంతో ఎన్నికల వేళ బీజేపీలో కీలక నేతలు బయటకు రావడం ఆరంభించారు.

నామినేషన్ల పర్వానికి ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి తదితర నేతలు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. తాజాగా విజయశాంతి బీజేపీకి రాజీనామా చేశారు. నేడో రేపో విజయశాంతి కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనేతలు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ తమకు ఆ పార్టీతో మిత్ర బంధం లేదని చెబుతున్నా.. పలువురు కీతల నేతలు మాత్రం ఆ మాటలు విశ్వసించకుండా బయటకు వచ్చేస్తున్నారు.

నెల రోజుల క్రితం విజయశాంతి నివాసంలో అసంతృప్తి నేతలు సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో పాల్గొన్న వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్, ఏనుగు రవీందర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్ పార్టీలో చేరగా, అదే సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ కొండా విశ్వశ్వరరెడ్డి ఇంకా బీజేపీలోనే ఉన్నారు. ఎన్నికల తరుణంలో బీజేపీ కీలక నేతలు ఒకరొకరుగా బయటకు వెళ్లిపోవడం ఆ పార్టీలో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. అయితే ఇది బీజేపీ స్వయం కృతాభిరాధమా లేక వ్యూహాత్మక ఎత్తుగడా అనేది తెలియాలి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఆగాల్సిందే.

Vijayasanti: బీజేపీకి బైబై చెప్పిన విజయశాంతి


Share

Related posts

మాజీ ఎంఎల్ఏ పున్నయ్య కన్నుమూత

Siva Prasad

AP Special Status Issue: ప్రత్యేక హోదా, పోలవరం నిధులపై రాజ్యసభలో వైసీపీ సభ్యులు నిరసన…సభ వాయిదా

somaraju sharma

బ్రేకింగ్ : ధోనీ అభిమానులకి మరొక గుండె పగిలే వార్త !!

arun kanna