పల్లె వాతావరణాన్ని, అక్కడి పరిస్థితులను, పల్లె ప్రజల మనస్తత్వాన్ని చిత్రీకరించి ఎంతో పేరు సంపాధించుకున్న యూటూబ్ ఛానల్ మై విలేజ్ షో.. ఈ షో ద్వారా గ్రామాల ముఖ చిత్రాలను, అక్కడి జీవన రేఖలను కల్లకుకట్టినట్టుగా తీయడంలో ఈ ఛానెల్ కు పోటీ ఎవరూ లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ షో ఎంతో అభిమానుల గుండెల్లో కొలువొందింది. ఈ షో ద్వారా పరిచయమైన వారందరూ ప్రత్యేకమైన వ్యక్తులుగా గుర్తింపుపొందుతున్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గంగవ్వ, అనీల్ జీల.. వీరిరువురి కాంబినేషన్ లో వచ్చే షో ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
ఈ షో ద్వారా గంగవ్వ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే.. కాగా ఈ షో ద్వారా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాధించుకున్నారు అనిల్ జీల.. అందరినీ నవ్విస్తూ, కవ్విస్తూ ఎంతో మంది అభిమానులను పొందారు అనిల్ జీల. కాగా సోషల్ మీడియా, యూట్యూబ్ స్టార్ గా వెలుగొందుతున్న అనిల్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అనుకున్నది అన్నట్టే జరిగిపోతే అనిల్ ఇప్పటికే గవర్నమెంట్ ఎంప్లాయిగా సేవలు చేస్తుండేవాడు. కాని అలా జరగలేదు. మరి ఒక గవర్నమెంట్ టీచర్ గా పనిచేయాల్సిన వ్యక్తి యూట్యూబ్ స్టార్ గా మారడానికి గల కారణాలు ఎంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
సిద్ధిపటలోని దర్గపల్లిలోని అనే చిన్న ఊరిలో వ్యవసాయం చేసే కుటుంబం మాది. చిన్నప్పటినుంచి గవర్నమెంట్ టీచర్ కావాలనే పట్టుదలతో చదువుతూ ముందుకు నడిచా. కొండగట్టు దగ్గర్లపోని ఓ మారుమూలం గ్రామంలో టీచింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ తో ఎయిడెడ్ స్కూల్లో టీచర్ గా కూడా పనిచేశా. అలాగే డీఎస్సీ రాసినుంటే నేను ఇప్పటికే గవర్నమెంట్ టీచర్ గా సేవలు అందిస్తూ ఉండేవాడిని. కాని జీవోలు మారడం మూలంగా డీఎస్సీ రాయడానికి కుదరలేదు. ఆ సమయంలోనే సోషల్ మీడియాలో ఏదో నాకంటూ ఉన్న ప్రతిభను అందరికీ చూపాలనుకున్న.
ఆ తరుణంలోనే మా దోస్తులతో కలిసి మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నా. ఈ షో ద్వారా నాకు ఎంతో మంచి పేరు వచ్చింది. దీనితో పాటుగా నా చదువు అందరికీ ఉపయోగపడేలా ఉండాలని మై విలేజ్ షో లు చేస్తూనే ‘అనిల్ జీల వ్లాగ్స్’ అనే పేరుతో ఛానల్ ను కూడా ప్రారంభించాను. దీంట్లో పిల్లలకు ఉపయోగపడే అనేక అంశాలను వివరించాను కూడా. అందులో ముఖ్యంగా చెప్పుకోల్సింది కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వివరించడం. ఈ వీడియో నాకు ఎంతో గుర్తింపును తెచ్చింది. మరీ ముఖ్యంగా ఈ వీడియోను చూసిన కేటీఆర్, కవిత గారు నన్ను ప్రశంసించారు. అయితే ఇన్ని చేస్తున్న నా జీవితంలో మార్పు మాత్రం రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు మాత్రం ఎప్పటిలాగే ఉన్నాయి. కాని ఇంకా గుర్తింపు తెచ్చుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే చాలా సినిమాల్లో అవకాశం కూడా లభించింది. మున్ముందు కూడా కొత్త కొత్త షో లు చేసి అందరిని మెప్పిస్తానంటూ అనిల్ జీల చెప్పుకొచ్చారు.