AP CID: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు నోటీసులు జారీ చేసిన అంశం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. దీనిపై అధికార వైసీపీ శ్రేణుల నుండి చంద్రబాబు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ నేతలు, మంత్రులు ఈ అంశంతో చంద్రబాబును, టీడీపీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు పాల్పడిన భారీ అవినీతిపై ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణ పనులను అప్పగించిన ప్రతి కాంట్రాక్ట్ సంస్థ నుండి భారీగా ముడుపులు తీసుకున్నారని చాలా కాలంగా వైసీపీ ఆరోపిస్తొంది. ఆ ఆరోపణలకు తగినట్లుగా రూ.118 కోట్ల రూపాయలు లంచాన్ని తీసుకున్నట్లుగా ఐటీ శాఖ గుర్తించింది. ఈ కేసులో ఐటీ శాఖ అధికారులు విచారణ సాగిస్తున్న క్రమంలో కొత్త కొత్త విషయాలను వెలుగులోకి వస్తున్నాయట.

ఈ అవినీతి వ్యవహారంలో వారు కోడ్ భాష వాడినట్లుగా ఐటీ శాఖ గుర్తించింది. అమరావతి రాజధాని ప్రాంతంలో రూ.8వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు అప్పగించిన షాపూర్జీ పల్లోంజీ, లార్సన్ అండ్ టూబ్రో (ఎన్ అండ్ టీ) సంస్థల నుండి ముడుపులు రూపంలో తన పీఎ శ్రీనివాస్ ద్వారా రూ.118 కోట్ల రూపాయలు తీసుకున్నారనీ, ఈ వ్యవహారంలో ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు కోడ్ భాష (లాంగ్వేజ్) వాడినట్లుగా పేర్కొన్నట్లు సమాచారం.

ఓ పక్క ఆదాయపన్ను (ఐటీ) శాఖ నోటీసులతో తల పట్టుకున్న చంద్రబాబుకు ఇప్పుడు మరో దర్యాప్తు సంస్థ రంగ ప్రవేశం చేయడం గోరు చుట్టుపై రోకటి పోటుగా మారిందని అంటున్నారు. ఈ కేసులో తాజాగా ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. ఐ టీ స్కామ్ కు స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కామ్ కు సంబంధం ఉన్నట్లుగా సీఐడీ గుర్తించింది. ఈ రెండింటి మూలాలు కూడా ఒకే చోట ఉన్నాయని ఏపీ సీఐడీ నిర్ధారణకు వచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, ఐటీ కుంభకోణం లో ఒకే వ్యక్తులు ఉన్నారనే విషయం విచారణలో తేలింది.

దీంతో ఐటీ స్కామ్ లో కీలక వ్యక్తిగా ఉన్న మనోజ్ వాసుదేశ్ పార్ధసాని, స్కిల్ డెవలప్ మెంట్ స్కాం నిందితుడు యోగేష్ గుప్తాకు ఏపీ సీఐడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. వీరిద్దని ఏపీ సీఐడీ అధికారులు విచారణ చేయనున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి, కంపెనీల నుండి ముడుపులు తీసుకున్నారంటూ ఇప్పటికే అభియోగాలు ఉన్నాయి. ఏపీ సీఐడీ అధికారులు ఈ ఇద్దరిని కలిపి విచారించి వారు చెప్పిన విషయాల ఆధారణంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. మరో పక్క వైసీపీ నేతల డిమాండ్ తో ఈడీ కూడా రంగ ప్రవేశం చేస్తుందా లేదా అన్నదానిపైనా సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.