YSRCP: జగన్ సర్కార్ పై కేంద్ర వైఖరి మారిందా..? దేనికీ ఈ సంకేతం..?

Share

YSRCP: ఏపిలోని జగన్మోహనరెడ్డి సర్కార్ పై కేంద్రంలోని బీజేపీ వైఖరి మారిందా..? రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందా..? అంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం వస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరిగిన నేపథ్యంలో ఇటీవల కేంద్రం లీటరుకు రూ.5,10 లు తగ్గించిన నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100ల దిగువకు తగ్గాయి. ఇదే తరుణంలో ఇటు, ఏపి తెలంగాణలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ దరలు తగ్గింపునకు చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు ఆందోళన చేశారు. కానీ ఏపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గింపు సరేమిరా అన్నాయి. బీజేపీ ఆందోళనలు పట్టించుకోకపోగా కేంద్రంలోని బీజేపీపైనే ఆరోపణలు, విమర్శలు చేశాయి. ఆ తరువాత నుండి ఏపి ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ వైఖరి మారిందనే మాటలు వినబడుతున్నాయి. వాటికి సంబంధించిన ఉదాహరణలు కనబడుతున్నాయి.

YSRCP: అమిత్ షా సూచనలతో ఆందోళనలకు సిద్దమవుతున్న ఏపి బీజేపి

తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఎందుకు సంఘీభావం తెలియజేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని ఏపి నేతలకు అమిత్ షా సూచించారు. అమిత్ షా దిశా నిర్దేశం తరువాతనే బీజేపీ నేతలు అమరావతి రైతుల మహా పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అమరావతి రాజదానికే బీజేపీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అమిత్ షా పిలుపుతో రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేసేందుకు బీజేపీ సమాయత్తం అవుతోంది.

అన్నమయ్య ప్రాజెక్టు ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యమంటూ వ్యాఖ్యలు

మరో పక్క కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తూనే ఉంది. భారీ వరదల కారణంగా కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అంటూ రాష్ట్ర వైఫల్యాన్ని ఎత్తిచూపారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఇది ప్రపంచ ఇంజనీర్లకు ఓ పరిశీలనాత్మక అంశం కావడం శోచనీయమని వ్యాఖ్యానించారు. మరి ఇంతకు ముందు టీడీపీ హయాంలో ఇంత కంటే ఘోరాలు జరగలేదా అంటే జరిగాయి, ఉన్నాయి. గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 32 మంది చనిపోయినప్పుడు కేంద్రం స్పందించలేదు. విహార యాత్రలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినా నాటి టీడీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టలేదు. ఈ విషయాన్ని పక్కన బెడితే..ఇటీవల 15వ ఆర్ధిక సంఘం నిధులను పంచాయతీల నుండి ప్రభుత్వం కరెంటు బిల్లులు చెల్లించేందుకు తీసుకుంటే దాన్ని తప్పుబట్టింది కేంద్రం. ఇకపై కేంద్రం పంచాయతీలకు పంపే నిధులకు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలు బ్యాంకు అకౌంట్ లు ఓపెన్ చేసుకోవాలని ఆదేశించింది.

రఘురామ ఫిర్యాదులతో ఏపి ప్రభుత్వానికి లేఖలు

అదే విధంగా రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నిర్వహించే పథకాలకు జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న పాలు అంటూ పేర్లు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఐసీడీఎస్ పథకాలకు కేటాయించిన రూ.187 కోట్లకు లెక్కలు పంపాలని కోరారు. అదే విధంగా ఎంపీ లాడ్స్ నిధులు చర్చి నిర్మాణానికి కేటాయించడంపైనా వివరణ ఇవ్వాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ వరుస పరిణామాలు అన్నీ చూస్తుంటే ఏపిలోని జగన్మోహనరెడ్డి సర్కార్ పై కేంద్రం వైఖరి మార్చుకుందా అన్న చర్చలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో వస్తున్న మార్పును ముందే గమనించి సీఎం జగన్మోహనరెడ్డి పార్లమెంట్ లో వైసీపీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారని భావిస్తున్నారు. తాము ఏ కూడమిలో లేమని కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని నిలదీస్తామని వెల్లడించారు. సో..ఇవన్నీ చూస్తుంటే కేంద్రం, రాష్ట్రం మద్య ఏదో తేడా వచ్చినట్లు కనబడుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.


Share

Related posts

Air Conditioners: మీరు ఏసి లో ఎక్కువగా ఉంటున్నారా? అయితే మీకు కరోనా తప్పదు!!

Naina

AP Capitals Bill: రాజధాని బిల్లు ఇలా ఉండొచ్చు..!? జగన్ మైండ్ లో కీలక ఆలోచనలు..!

Srinivas Manem

Kavitha: సినీ నటి కవిత ఇంట్లో విషాదం..!!

sekhar