ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి, పుంగనూరులో జరిగిన అల్లర్లకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఈ నెల 4వ తేదీన తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లులో జరిగిన సంఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడును ఏ 1గా, దేవినేని ఉమా ఏ 2గా కేసులు నమోదు చేశారు. వీరితో పాటు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పీలేరు నియోజకవర్గ ఇన్ చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు శ్రీరాం చినబాబు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జి గంట నరహరి తో పాటు మరి కొంత మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రాజెక్టుల సందర్శన పేరుతో చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి, పుంగనూరు లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో 50 మంది పోలీసులు గాయపడ్డారు. డాక్టర్ ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబు తదితరులపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 4న మారణాయుధాలు, ఐరన్ రాడ్లు, ఇటుకలు, కర్రలు, రాళ్లు వంటి వాటితో ప్రయాణిస్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారంటూ ఉమాపతిరెడ్డి ఫిర్యాదు చేశారు. 307 హత్యాయత్నం, 120 బీ నేరపూరిత కుట్ర చట్టాల కింద కేసు నమోదు చేశారు.
పుంగనూరు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ 74 మందిని అరెస్టు చేశారు. పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై అయిదు కేసులు నమోదు చేశారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్థన్ రెడ్డి పోలీసులకు చిక్కాడు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని ఆతను తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.