Machilipatnam (Krishna): బందరు ఓడరేవు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. తపసిపూడి గ్రామంలో సముద్ర తీరాన జరుగుతున్న పోర్టు నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. నెల రోజుల 22వ తేదీన సీఎం జగన్ పోర్టు పనులకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. నెల రోజుల క్రితం పనులు ప్రారంభం కాగా పనుల్లో గణనీయమైన పురోగతి సాధించినట్టు ఆయన తెలిపారు. గత నెల సీఎం జగన్ శంకుస్థాపన చేయగా చాలా మంది ఇది ఎలక్షన్ స్ట్రంట్ అంటూ విమర్శలు చేశారనీ, కానీ తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పోర్టు పనులు చేపడుతుందని వివరించారు.

నెల రోజుల్లో 190 మీటర్ల మేర సౌత్ బ్రేక్ వాటర్ వాల్ నిర్మాణ పనులు, 130 మీటర్ల మేర నార్త్ వాటర్ బ్రేక్ వాటర్ వాల్ నిర్మాణ పనులు పూర్తయినట్టు తెలిపారు. ఈ నెల 30వ తేదీన బెర్త్ ల నిర్మాణానికి గాను పైల్ టెస్ట్ లు నిర్వహించనున్నట్టు చెప్పారు. పైల్ టెస్ట్ రిపోర్ట్ ఆధారంగా బెర్త్ ల డిజైన్ చేసి నిర్మాణ పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. కార్గో నిల్వ చేసేందుకు నేల చదును చేస్తున్నట్టు తెలిపారు. 30 నెలల్లో పోర్టు పనులు పూర్తి చేయాల్సి ఉండగా 24 నెలల్లోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్టు పేర్ని నాని వివరించారు.