ఏపిలో గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడానికి విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యజ్ఞాలు, యాగాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి యజ్ఞయాగాదులు చేసినట్లు ఆనాడు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ బహిరంగంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ శారదా పీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర స్వామిజీ ఆశీస్సులు స్వీకరించారు. కానుకలు సమర్పించుకున్నారు. తర్వాత పలు పర్యాయాలు స్వామీజీని సీఎం జగన్ కలిశారు. తరచు పలువురు మంత్రులు, కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం శారదా పీఠాన్ని సందర్శించి స్వామీజీ ఆశీస్సులు తీసుకుంటూనే ఉంటున్నారు. దీంతో విశాఖ శారదా పీఠం, పీఠాధిపతి రాష్ట్రంలో వైసీపీకి, సీఎం వైఎస్ జగన్ కు అనుకూలమనే ప్రచారం జరుగుతోంది. దీనిపై శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి క్లారిటీ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

శారదా పీఠం ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయదని స్పష్టం చేశారు. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని యజ్ఞ యాగాదులు చేయమని తెలిపారు. దేశం సస్యశ్యామలంగా ఉండాలన్నదే తమ కోరిక అని, ప్రజల కోసం తమ పీఠం పాడుపడుతుందని తెలిపారు. శారదా పీఠంపై కొందరు రాజకీయ ముద్ర వేయాలని చూశారని, అయితే శారదా పీఠం ధర్మం వైపు నడుస్తుందని స్పష్టం చేశారు. భారతదేశంలో హిందూ ధర్మాన్ని వేగంగా వ్యాప్తి చేయాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. ఎక్కడైతే యజ్ఞాలు జరుగుతాయో అక్కడ అంతా బాగుంటుందని అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో శారద పీఠానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఢిల్లీలో కూడా శారదా పీఠం ఏర్పాటుకు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ప్రపంచంలో భారతదేశానికి విశేష ఆదరణ ఉంటుందన్నారు. ధార్మిక ఆథ్యాత్మిక కార్యక్రమం హర్యానా లోని కురుక్షేత్రంలో శ్రీ లక్ష చండీ మహాయజ్ఞం విజయవంతమైందని అన్నారు. భక్తులు పెద్ద ఎత్తున హజరయ్యారని తెలిపారు. చరిత్రలోనే తొలిసారిగా భారీ ఎత్తున లక్షకుపైగా చండీ పారాయణ హోమాలను ఈ యజ్ఞం ద్వారా నిర్వహించినట్లు చెప్పారు. భారతదేశం మొత్తానికి మంచి జరగాలని యజ్ఞం చేశామని స్వామిజీ తెలిపారు.
చంద్రబాబు చేయని ఆ పని జగన్ చేశారు .. అది ఏమిటంటే..?
