NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP vs Janasena: జగ్గంపేటలోనూ పిఠాపురం సీన్ .. టీడీపీ – జనసేన ఆత్మీయ సమావేశంలో నేతల మధ్య రగడ

Share

TDP vs Janasena: టీడీపీ – జనసేన పొత్తు నేపథ్యంలో ఆయా పార్టీల జేఏసీ పిలుపు మేరకు నియోజకవర్గ స్థాయిలో టీడీపీ – జనసేన ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. వివిధ నియోజకవర్గాల్లో ఇరువర్గాల నేతలు సమన్వయంతో సమావేశాలను కొనసాగిస్తుండగా, ఇరు పార్టీల నేతలు పోటీకి సై అంటున్న పలు నియోజకవర్గాల్లో మాత్రం నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. రీసెంట్ గా కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన టీడీపీ – జనసేన నేతల ఆత్మీయ సమావేశం రసాభాస అయిన సంగతి తెలిసిందే.

తాజాగా అటువంటి సీన్ అదే జిల్లా  జగ్గంపేటలోనూ రిపీట్ అయ్యింది. ఈ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పోటీ చేయాలని భావిస్తుండగా, జనసేన నుండి నియోజకవర్గ ఇన్ చార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర టికెట్ ఆశిస్తున్నారు. గురువారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా సీటు తనదేనని జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించడంతో ఉద్రిక్తత నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు కూడా తనకు ఉన్నదని అంటూనే జనసేన నియోజకవర్గ ఇన్ చార్జి పాఠంశెట్టి సూర్యచంద్రకు సీటు ఇస్తే పొత్తులో ఉండనని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. దీంతో సమావేశాన్ని సూర్యచంద్ర బహిష్కరించారు.

ఈ క్రమంలో జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్, సూర్యచంద్ర మధ్య మాటల యుద్దం జరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ పరిస్థితులు చూస్తుంటే టీడీపీ – జనసేన మధ్య పొత్తు వికటించి నేతల మధ్య వివాదం ముదిరి వైసీపీకి లాభం చేకూర్చేలా ఉన్నాయని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన సూర్యచంద్రకు కేవలం 5.88 శాతం ఓట్లు (10,649) మాత్రమే వచ్చాయి. టీడీపీ తరపున పోటీ చేసిన జ్యోతుల నెహ్రూ 70వేల ఓట్లతో రెండో స్థానంలో నిలవగా, 23వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్ధి జ్యోతుల చంటిబాబు విజయం సాధించారు.

ఇక జ్యోతుల నెహ్రూ విషయానికి వస్తే టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన జ్యోతుల నెహ్రూ 1994 లో తొలి సారి గా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1999లోనూ రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. అనంతరం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 50వేలకుపైగా ఓట్లు సాధించి కేవలం 789 ఓట్ల స్వల్ప తేడాతో తోట నర్శింహం (కాంగ్రెస్) చేతిలో పరాజయం పాలైయ్యారు. టీడీపీ అభ్యర్ధి జ్యోతుల చంటిబాబు కు 33వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత జ్యోతుల నెహ్రూ 2013లో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన జ్యోతుల నెహ్రూ నాటి టీడీపీ అభ్యర్ధి జ్యోతుల చంటిబాబుపై 15,932 ఓట్ల మెజార్చటీతో గెలుపొందారు. అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటి ప్లోర్ లీడర్ గా, వైసీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు. 2016 ఏప్రిల్ నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి చేరారు జ్యోతుల నెహ్రూ. దీంతో అప్పటి వరకూ టీడీపీ లో ఉన్న జ్యోతుల చంటి బాబు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ పై చంటిబాబు 23వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొన్న పిఠాపురంలో, నేడు జగ్గంపేటలో ఇరు పార్టీ నేతల మధ్య ఘర్షణలు చెలరేగడం పార్టీ అధిష్టానాలకు తలనొప్పిగా మారుతోంది. ఈ సమస్యలను పార్టీ నేతలు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.

Chandrababu: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు


Share

Related posts

Cine editor Goutham Raju: తెలుగు చిత్ర సీమలో విషాదం .. సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు ఇకలేరు

somaraju sharma

కెజిఎఫ్2 మళ్ళీ వెనక్కి వెళ్ళిందా ..?

GRK

Parvati Nair Latest Photos

Gallery Desk