YS Jagan: టీడీపీ అధినేత నారా చంద్రబాబును ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ సీఐడీ అరెస్టు చేయడం, ఏసీబీ కోర్టు ఆదేశాలతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించడం తెలిసిందే. ఆదివారం ఆర్ధరాత్రి నుండి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లోనే ఉన్నారు. ఈ తరుణంలోనే నిన్న ఉదయం సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటన ముగించుకుని తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై సీఎం వైఎస్ జగన్ అధికారులు, ముఖ్యనేతలతో చర్చించారుట.
అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్య శ్రీరాం, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తదితరులు సీఎం జగన్ ను కలిసి కేసుకు సంబంధించి వివరాలు తెలియజేసినట్లు సమాచారం. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో 37వ నిందితుడుగా అరెస్టు చేసిన ఏపీ సీఐడీ .. ఈ కేసులో విచారణ నిమిత్తం కష్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఇదే క్రమంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కామ్ కేసులో ఏ 1 గా చంద్రబాబు ఉండటంతో ఈ కేసులో అరెస్టు చేసేందుకు కూడా పీటీ వారెంట్ పిటిషన్ ను ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు రిమాండ్ రిపోర్టుపై ఏసీబీ కోర్టులో జరిగిన వాదనల్లో ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించడంతో కోర్టు సీఐడీ వాదనకు ఏకీభవిస్తూ రిమాండ్ విధించింది. చంద్రబాబు మీద చాలా కేసులు ఉన్నాయనీ ఇప్పట్లో చంద్రబాబు బయటకు రావడం కష్టమేనని వైసీపీ నేతలు అంటున్నారు.
దీంతో ఆయనపై ఉన్న కేసులు అన్నీ ఇప్పుడు బయటకు తీసి ఒక కేసులో బెయిల్ రాకముందే మరో కేసులో పీటీ వారెంట్ దాఖలు చేసే అలోచనలో ప్రభుత్వం ఉందన్న వాదనలు వినబడుతున్నాయి. దీంతో ప్రతి కేసులోనూ చంద్రబాబు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసును సీఐడీ తో పాటు ఈడీ కూడా దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో ఈడీ కూడా రంగంలోకి దిగితే చంద్రబాబు మరింత ఇరుకునపడతారు అనే మాట వినబడుతోంది.

అందుకే లండన్ నుండి వచ్చిన వెంటనే సీఎం జగన్ .. ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని అంటున్నారు. ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా లతో భేటీ అయి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు చర్చించడంతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ అంశంలో ఈడీ దర్యాప్తును వేగవంతం చేయాలని కోరే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి. టీడీపీ ఈ సంక్షోభం నుండి బయటపడే లోపుగానే ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది అనే విషయాలపైనా చర్చించి తదనుగుణంగా చర్యలు చేపట్టే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
TDP: పాపం చంద్రబాబు జైల్లో ఉన్నాడు అన్న బాధ కూడా లేకుండా తెలుగు తమ్ములు ఏం చేస్తున్నారో చూడండి !