ఆనందంలో యూకే ఫార్మా కంపెనీ.ఆక్సఫర్డ్ యూనివర్శిటీతో కలిపి వ్యాక్సిన్ల తయారీకి ఒప్పందం కుదుర్చుకున్న అస్ట్రాజెనెకా ప్రపంచానికి ఓ శుభవార్త చెప్పింది.
వ్యాక్సిన్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అడుగులు వేస్తోంది. మూడోదశ హ్యూమన్ ట్రయల్స్ విజయవంతం కావడంతో త్వరలోనే టీకాను మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్లు తయారు చేసి పంపిణీ చేసేందుకు వివిధ దేశాలతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న కంపెనీ వ్యాక్సిన్ ట్రయళ్లతో వస్తున్న రెస్పాన్స్ తో ఉబ్బితబ్బిబ్బవుతోంది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలంటూ కంపెనీకి పలు దేశాలు భారీగా నిధులు పంపిణీ చేస్తుండటంతోపాటు, పరిశోధనల్లో పురోగతితో కంపెనీ మంచి ఊపుమీద కన్పిస్తోంది.
బ్రిటన్ ఫార్మా దిగ్గజం అస్ట్రాజెనెకా ఇవాళ కరోనాకు సంబంధించి గొప్ప ప్రకటన చేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీగా హ్యూమన్ ట్రయల్స్ వేస్తున్న సంస్థ కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుందని ప్రకటించింది. వ్యాక్సిన్ తయారీతో కంపెనీ జాతకం కూడా మారిపోయింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తయారీకి సంబంధించి గణనీయమైన పురోగతి జరిగిందని… కంపెనీ సీఈవో పాస్కల్ సెరాయట్ మీడియాకు వివరించారు. ఈ ఏడాది చివరిలోగా వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడంతోపాటు 200 కోట్ల టోసుల టీకాలను మార్కెట్లోకి తెచ్చేలా పలు కంపెనీలతో ఒప్పందాలు సైతం చేసుకొంది అస్ట్రోజెనెకా.
కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందు వరసులో ఉన్న అస్ట్రాజెనెకాకు ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అవుతోంది. రెండో త్రైమాసికంలో భారీగా కంపెనీ ఆదాయం పెరుగుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ ప్రకటనలతో కంపెనీ షేర్లు మూడు శాతం పెరిగి… 88.6 పౌండ్లకు చేరింది. 6 బిలియన్ల ఉత్పత్తులను జూన్ వరకు విక్రయించింది. షుగర్ వ్యాధితోపాటు, గుండె, క్యాన్సర్ వ్యాధుల టీకాలకు అస్ట్రాజెనెకాకు మార్కెట్లో
మంచి గుర్తింపు ఉంది. కోరనా వ్యాక్సిన్ సక్సెస్ అయితే కంపెనీ రూపురేఖలు మారిపోతాయ్. ప్రపంచదిగ్గజ ఫార్మాగా స్థానాన్ని సుసంపన్నం చేసుకునే అవకాశం ఉంది.