దోమలు అధికంగా నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో నివసిస్తాయి. నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే అందులో దోమ లార్వా బాగా అభివృద్ధి చెంది దోమల సంఖ్య పెరగడానికి కారణమవుతుంది, తద్వారా ప్రమాదకరమైన మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతున్నాయి.
ఈ దోమల సమస్య మహానగరాల్లో మరీ ఎక్కువగా ఉంటుంది . అక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం తో నిరంతరం నీరు నిల్వ ఉండి , అందులో దోమ లార్వా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అక్కడ దోమల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ దోమలను నిర్మూలించడానికి మున్సిపల్ అధికారులు ఫాగింగ్ చేయడం, బ్లీచింగ్ పౌడర్ ను చల్లడం ,దోమల నిర్మూలనకు కొన్ని రసాయనాలను స్ప్రే చేయడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు అయితే ఈ కార్యక్రమాలు మున్సిపల్ సిబ్బందికి అధిక శ్రమతో కూడుకున్నవి. దోమల నిర్మూలనకు రసాయనాలు స్ప్రేచేసినప్పుడు అవి సిబ్బందిపై కూడా కొంత అనారోగ్యానికి కారణం అవుతాయి . కాబట్టి ఈ సమస్యను అధిగమించడానికి ఆయిల్ బాల్స్ ప్రయోగం చేశారు. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. .
ఈ ఆయిల్ బాల్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వివిధ వాహనాల్లో ఉపయోగించి తీసివేసిన వేస్ట్ ఆయిల్ ని తక్కువ ఖర్చుతో సేకరించి , నిల్వ ఉంచుకోవాలి. తర్వాత గన్ని బ్యాగ్స్ (గోనె సంచి) తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి అందులో కట్టే కోత మిషన్ లో దొరికే పొట్టు ను ఉంచి చిన్న బంతి లా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న బాల్స్ ను మనం సేకరించిన వేస్ట్ ఆయిల్ లో రెండు లేదా మూడు రోజులు
నానబెట్టాలి. అలా తయారు చేసుకున్న ఆయిల్ బాల్స్ ను మురుగు నీరు నిల్వ ఉన్న చెరువులో, డ్రైనేజీలలో ఉంచినప్పుడు ఆయిల్ బాల్స్ లో ఉన్న ఆయిల్ నెమ్మదిగా నీటిపై ఒక పొరలా ఏర్పడి దోమల లార్వాలను సమర్థవంతంగా చంపుతుంది తద్వారా దోమల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు.