ఎముకలకు సంబంధించి వచ్చే అనేక రకాల వ్యాధుల్లో ఆస్టియో పోరోసిస్ కూడా ఒకటి. సాధారణంగా ఈ వ్యాధి ఎముకలు దృఢత్వాన్ని కోల్పోయి వాటి లోపల గుల్లగా మారడం వల్ల వస్తుంది. ఎముకల్లో సాంద్రత తగ్గుతుంది. దీంతో బలహీనంగా మారుతారు. చేతితో ఏదీ పట్టుకున్నా గ్రిప్ ఉండదు. గోళ్లు పగులుతాయి. ఎముకలు బలహీనంగా మారుతాయి. అయితే ఈ వ్యాధికి డాక్టర్ సూచించిన మందులతోపాటు కింద తెలిపిన పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీంతో ఈ వ్యాధి నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది.
1. కాల్షియం
ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మనకు కాల్షియం కావాలన్న సంగతి చాలా మందికి తెలుసు. అందువల్ల ఆస్టియో పోరోసిస్ రాకుండా ఉండాలన్నా, ఆ సమస్య నుంచి బయట పడాలన్నా ఎముకలు ఆరోగ్యంగా ఉండాలి. అందుకు కాల్షియం ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవాలి. కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముకలకు చెందిన సమస్యలు రాకుండా ఉంటాయి. పాలు, గుడ్లు, బాదం పప్పు, పాలకూర, ఆరెంజ్, నట్స్, చీజ్ తదితర పదార్థాల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
2. విటమిన్ డి
మన శరీరంలో ఎముకలు దృఢంగా ఉండేందుకు, ఎముకల ఆరోగ్యానికి కాల్షియం ఎంతగా అవసరమో, విటమిన్ డి కూడా అంతే అవసరం. మనం తినే ఆహారాల్లో ఉండే కాల్షియాన్ని శరీరం గ్రహించేందుకు విటమిన్ డి కావాలి. నిత్యం ఉదయాన్నే 20 నిమిషాల పాటు అయినా సూర్య రశ్మి మన శరీరానికి తగిలేలా చూసుకుంటే విటమిన్ డి లభిస్తుంది. లేదా చేపలు, బాదంపప్పు, పాలు, కోడిగుడ్డు పచ్చ సొన తినడం వల్ల కూడా విటమిన్ డి మనకు లభిస్తుంది.
3. విటమిన్ సి
ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు విటమిన్ సి కూడా మనకు అవసరమే. ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు పనిచేసే అడ్రినల్ స్టెరాయిడ్ హార్మోన్ల పనితీరుకు విటమిన్ సి అవసరం అవుతుంది. కనుక విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
4. ప్రోటీన్
నిత్యం తగినంత ప్రోటీన్ ఉండే ఆహారాలను తీసుకోకపోతే శరీరంలోని ఎముకలు గుల్లబారిపోయి బలహీనంగా మారుతాయి. దీంతో ఎముకలు విరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రోటీన్లు ఉండే ఆహారాలను కూడా నిత్యం తీసుకోవాలి.