ఏపీ లో పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గురించి విమర్శించే సమయంలో ప్రతి సారీ మూడు పెళ్లిళ్లు అంటూ విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. బ్రో సినిమా వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి సినిమాలు, వెబ్ సిరీస్ లు తీస్తామని కూడా అన్నారు. ప్రతి సారి వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తుండటంపై తాజాగా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించారు. ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ తల్లిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను ఎదుర్కోండి కానీ పిల్లల విషయాన్ని లాగకండి అని విజ్ఞప్తి చేశారు. ఆయన నా విషయంలో చేసింది ముమ్మాటికీ తప్పే .. అయితే పిల్లలను రాజకీయాల్లోకి లాగకండని అన్నారు. ఆయన ప్రజలకు సేవ చేయాలని అనుకునే వ్యక్తి.

ఆ విషయంలో తన సపోర్టు మాత్రం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఒక సిటిజన్ గా మాత్రం తాను పవన్ కళ్యాణ్ కు మద్దుతుగా ఉంటానని చెప్పుకొచ్చారు. మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. నా బిడ్డల తండ్రి నటుడు, రాజకీయ నాయకుడు. అభిమానులు, నేతలు, విమర్శకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నా పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగకండి అని విజ్ఞప్తి చేశారు. తన మాజీ భర్త, తనకు సంబందించిన అంశాలతో సినిమా, ఓటీటీ సిరీస్ లు తీస్తామంటున్నారని అది కరెక్ట్ కాదన్నారు. తన పిల్లలే కాదు, ఏ రాజకీయ నాయకుడి పిల్లలను లాగడం మంచిది కాదని సూచించారు.

ఆయన వ్యక్తిగతంగా చాలా మంచోడు. సమాజానికి ఎదో చేయాలనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకూ ఆయన చాలా అరుదైన వ్యక్తి. ఆయన డబ్బు మనిషి కాదు. డబ్బుపై ఆయనకు ఆసక్తి లేదు. సమాజానికి ఏదైనా చేయాలనుకుంటున్నాడు. ఆయన సక్సెస్ ఫుల్ హీరో, కావాలంటే సినిమాల్లో కొనసాగవచ్చు. కావాల్సినంత క్రేజ్, డబ్బు వస్తుంది. కానీ ఆయన రాజకీయాలు ఎంచుకున్నాడు. కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కనపెట్టాడు. ఆయన దగ్గర నేను లేకపోయినా, ఆయన్ను గమనిస్తునే ఉన్నాను. ఆయన రాజకీయంగా నిజాయితీగా ఉన్నారు. చెప్పడానికి కాస్త కష్టంగా ఉన్నప్పటికీ చెబుతున్నాను. ఆయనకు ఓ అవకాశం ఇవ్వండి. నేను ఆయన మాజీ భార్యగా చెప్పడం లేదు. సమాజానికి చెందిన ఓ పౌరురాలిగా చెబుతున్నాను అని విజ్ఞప్తి చేశారు. రేణుదేశాయ్ విజ్ఞప్తి పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అమ్మా రేణూ.. మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని అంటూ ట్వీట్ చేశారు. అటు రేణుదేశాయ్ వీడియో, ఇటు అంబటి రాంబాబు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.