చంద్రబాబు గురించి అసెంబ్లీలో సీఎం జగన్ ఏమన్నారంటే…

 

అయిదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా ఎప్పుడూ తాను పోడియం వద్దకు రాలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ఏపి అసెంబ్లీలో టీడీపీ నేతలు సోమవారం చేసిన రాద్దాంతంపై జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు ప్రభుత్వం చేసిన మంచిని పక్కదారి పట్టించేందుకు అసెంబ్లీలో చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఈ డ్రామాలో చంద్రబాబు యాక్టర్ అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5..కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టన్ అంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ప్లోర్ పై చంద్రబాబు కూర్చోవడాన్ని తప్పుబట్టారు. సభలో ఆయన రౌడీయిజం చేస్తున్నారని అన్నారు. మళ్లీ ఆయనకేదో అన్యాయం జరిగిపోయినట్లు చంద్రబాబు తీరు ఉందన్నారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని జగన్ మండిపడ్డారు. రాజ్యాంగ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనన్నారు జగన్.

 

తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఇది రెండవ నవంబర్ నెల. ఏ రిజర్వాయర్ చూసుకున్నా నిండు కుండల్లా కళకళలాడుతున్నాయ, గతంలో చంద్రబాబు హయాంలో ఏలా ఉన్నాయో చూశారని అన్నారు. గత పదేళలలో ఎన్నడూ లేని విధంగా భూగర్భజలాలు రీచార్జి అయ్యాయన్నారు. అడపదడపా కురిసిన భారీ వర్షాలకు కొద్దిగా రైతులు నష్టపోయారనీ అయితే నిజాయితీగా సమీక్ష జరిపి ఆ వ్యవసాయ సీజన్‌లోనే నష్టపరిహారం, ఇన్ పుట్ సబ్సిడీ అందించడం జరిగిందన్నారు. గతంలో ఈ విధంగా ఎప్పుడూ జరగలేదన్నారు జగన్. ప్రతిపక్షం ఏదో అడిగిందనో, పత్రికల్లో రాసారనో తాను వివరణ ఇవ్వడం లేదన్నారు. రైతులకు, నాకు ఉన్న ఆత్మీయ అనుబంధంతోనే రైతుల పక్ష పాతి ప్రభుత్వం మనది అని సగర్వంగా తెలియజేస్తున్నామన్నారు జగన్. ఏ సీజన్ అయితే రైతులు నష్టపోయారో ఆ సీజన్‌లోనే నష్టపరిహారం అందించడం చరిత్రలో ఇది తొలిసారి అన్నారు.

 

అంతకు ముందు బీఎసీ సమావేశంలో సమావేశాలను అయిదు రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ ఉప నేత కింజరపు అచ్చెన్నాయుడు పది రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అయిదు రోజులకు కుదించడం జరిగిందన్నారు. 60 సంవత్సరాలు పైబడిన సభ్యులు చాలా మంది ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.