(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో సెలవు కావాలనే పోలీసులకు అవమానకరమైన షరతులు ఎదురయ్యాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఛాత్ మహోత్సవ్ చాలా పెద్ద పండుగ. నాలుగు రోజుల ఆ పండుగ గురువారం నుంచి ప్రారంభం అయింది.
ఛాత్ కోసం సెలవు కావాలంటే నిజంగా ఛాత్ కోసమే అని సెలవు చీటీతో పాటు ఒక ప్రమాణపత్రం దాఖలు చేయాలని అధికారులు షరతు పెట్టారు. అబద్ధం చెప్పి సెలవు తీసుకుంటే ఛాత్ దేవత సాక్షిగా నాకు, నా కుటుంబసభ్యులకూ శాపం తగులుతుంది అని రాసిఉన్న ఆ ప్రమాణపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
బీహార్ పోలీసుల సంఘం అధ్యక్షుడు మృత్యుంజయ్ సింగ్ దీనిపై మండిపడ్డారు. పోలీసులను ఇంత అవమానానికి గురి చేయాలా, నేను ఉన్నతాధికారులను కలిసి సంగతి తేల్చుకుంటాను అని ఆయన పాట్నాలో మీడియాకు చెప్పారు. ఈ గొడవ చూసి సమస్తిపూర్ పోలీసు అధికారులు తూచ్ అన్నారు. అసలు ప్రమాణపత్రమే లేదు పొమ్మని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వికాస్ బర్మన్ అన్నారు.