ఈ రోజుల్లో చాలా మందికి టాటూ వేయించుకోవడం అంటే ఫ్యాషన్. యువత టాటూల మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. టాటూగా తమకు ఇష్టమైన వారి పేరును కానీ సింబల్స్‌ను కానీ వేయించుకుంటూ తమకు వారంటే ఎంత ఇష్టమో వారికీ తెలియజేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే కెనడా లో జరిగింది. ఒక తండ్రి తన 8 ఏళ్ల కొడుకులో ఆత్మస్థైర్యం నింపడానికి చాలా బాధను భరించాడు. ఏకంగా 30 గంటల పాటు ఆ తండ్రి బాధ భరిస్తూ టాటూను వేయించుకున్నాడు.
డెరెక్ ప్రూ సీనియర్ అనే వ్యక్తి కెనడాలోని అల్బెర్టా స్టోనీ ప్లెయిన్ ప్రాంతానికి చెందినవాడు. అతనికి డెరాక్ జూనియర్ అనే 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు. డెరాక్ కొడుకుకు పుట్టుకతోనే ఛాతి మీద పెద్ద పుట్టుమచ్చ ఉంది మరియు పిల్లాడితో పాటు ఆ పుట్టుమచ్చ కూడా పెరిగి పెద్దదైంది. దీనితో ఆ పిల్లవాడికి షర్టు లేకుండా ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ మచ్చను చూసుకుని డెరెక్ జూనియర్ చాలా మనస్థాపానికి గురి అయ్యేవాడు. ఈ సమస్య ముఖ్యంగా అతను స్విమ్మింగ్ పూల్ కు వెళ్లినప్పుడు ఇబ్బంది పెట్టేది. అలా ఆ మచ్చ పిల్లవాడికి పెద్ద తలనొప్పిగా అవ్వడంతో దీన్ని గమనించిన అతని తండ్రి తన కొడుకులో ఆత్మస్థైర్యాన్ని నింపాలని నిర్ణయించుకున్నాడు.
ఇందుకోసం అతను తన కొడుకుకి ఏ ప్రదేశంలో అయితే మచ్చ ఉందో అదే ప్రదేశంలో తను కూడా పెద్ద టాటూను వేయించుకోవాలని అనుకున్నాడు. కొడుకుకి ఉన్న పెద్ద మచ్చను టాటూగా, అదే కలర్, అదే ప్రదేశంలో వేయించుకోవడానికి డెరెక్ కి మొత్తం 30 గంటల సమయం పట్టింది. ఆ 30 గంటల పాటు బాధను భరిస్తూ టాటూ వేయించుకున్నాడు.