24 గంటలుగా తెలుగు సోషల్ మీడియాలో ఒక్కటే కలకలం.. వచ్చే ఎన్నికల్లో జగన్ గుడివాడలో ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నానికి సీటు ఇవ్వడం లేదు.. ఈ సారి ఆయన్ను పక్కన పెట్టేస్తున్నారు.. గుడివాడ వైసీపీ బరిలో మరో కొత్త నేత రాబోతున్నాడంటూ ఒక్కటే ప్రచారం జరుగుతోంది. దీనిపై కాస్త లోతుగా ఆరా తీస్తే జగన్ మనసులో ఏముందో గాని గుడివాడలో మాత్రం ఈ చర్చ నిజమే అంటున్నారు. కొత్త నేతకు టిక్కెట్ అంటూ గుడివాడ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కూడా వెలిశాయి.
నానిని తప్పించాల్సిన అవసరం ఏంటి ?
కొడాలి నాని గుడివాడలో ఓటమి లేకుండా నాలుగు వరుస విజయాలు సాధించారు. 2004, 2009లో టీడీపీ నుంచి గెలిచిన నాని.. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి 2014, 2019లో మళ్లీ గెలిచారు. జగన్ కేబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. అయితే మార్పుల్లో అంతటి నాని లాంటి వాడినే జగన్ నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పెట్టేశాడు. నాని ఎంత చంద్రబాబు, లోకేష్, టీడీపీని బండ బూతులు తిట్టినా జగన్ లెక్కలు జగన్‌వి. మంత్రి పదవి పీకేయడమే పెద్ద షాక్ అనుకుంటే అంతటి నానికి ఇప్పుడు గుడివాడ సీటు లేకుండా చేయడం మరో పెద్ద సెన్షేషన్.
ఒక్కటి మాత్రం నిజం.. ఈ సారి టీడీపీ గుడివాడలో ఈక్వేషన్ మార్చేసింది. ఈ ఈక్వేషన్ ఇప్పుడు నానిని ఫస్ట్ టైం బాగా కలవర పెడుతోంది. ఇంకా చెప్పాలంటే వైసీపీ వాళ్లే నాని గెలుపు ఈ సారి అంత ఈజీ కాదంటున్నారు. మరి ఈ విషయం జగన్ చెవిలో పడకుండా ఉంటుందా.. అందుకే నానిని గుడివాడ నుంచి తప్పించే ప్లాన్ రెడీ అయిపోయిందంటున్నారు. గుడివాడలో ఈ సారి టీడీపీ నుంచి కమ్మ వర్గానికే చెందిన ఎన్నారై వెనిగండ్ల రాము పోటీలో ఉంటున్నారు. కుల, ఆర్థిక బలాల్లో నానికి రాము ధీటైన ప్రత్యర్థి. పైగా రాము భార్య ఎస్సీ మాల కమ్యూనిటీ.. ఆమె గత యేడాది కాలంగా ఆ కులంలోకి బాగా చొచ్చుకుపోయి మంచి పట్టు సాధించారు.
ఇది నాని గెలుపుపై సందేహాలు ముసురుకునేలా చేసింది. ఎందరో మహామహులనే మార్చేస్తున్న జగన్‌కు కొడాలి నాని సీటు మార్చేయడం పెద్ద లెక్కేకాదు. పైగా జగన్ సన్నిహితుడు రాయచోటి శ్రీకాంత్ రెడ్డికే అక్కడ సీటు లేదంటున్నారు. ఈ లెక్కన నాని ఓ లెక్కా జగన్‌కు. అందుకే నానిని గుడివాడ నుంచి మార్చి గన్నవరం నుంచి పోటీ చేయిస్తారని టాక్ ? నానికి ఇష్టమైతే పోటీ చేస్తాడు.. ఇంకా కష్టమైతే వైసీపీ నుంచి బయటకు వచ్చి తన దారి తాను చూసుకుంటాడు.
ఇక నాని ప్లేస్‌లో కమ్మ వర్గం నుంచి మండలి హనుమంతురావు పేరు వినిపిస్తోంది. ఆయనకే గుడివాడ సీటు అంటున్నారు. ఇక కమ్మ వర్గం నుంచి కొడాలి నాని తనను మార్చాల్సి వస్తే తన సన్నిహితుడు అయిన దుక్కిపాటి శశిభూషణ్ పేరు రికమెండ్ చేసినా జగన్ పట్టించుకోలేదని టాక్. ఇక మరో యాదవ కమ్యూనిటీ నేత కూడా తాను రేసులో ఉన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. అది గుడివాడ వైసీపీ సీటు సంగతి..!