AP High Court: అమరావతి ఇన్నర్ రింగ్ అలైన్ మెంట్ కేసులో నారా లోకేష్ ను నిందితుడుగా పేర్కొంటూ ఇటీవల ఏపీ సీఐడీ కోర్టులో మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. లోకేష్ పేరును ఏ 14 గా పేర్కొన్న నమోదు చేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఇవేళ విచారణకు వచ్చింది. హైకోర్టు .. లోకేష్ ముందస్తు బెయిల్ పై విచారణ చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు.
దర్యాప్తు అధికారి ఎఫ్ఐఆర్ లో మార్పు చేశారని నివేదించారనీ, ఈ కేసులో లోకేశ్ కు సీఆర్పీసీ 41 ఏ నోటీసులు ఇస్తామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. దానికి సంబంధించి నిబంధనలు పూర్తిగా పాటిస్తామని కోర్టుకు ఏజీ తెలిపారు. ఒక వేళ లోకేశ్ విచారణకు సహకరించకపోతే కోర్టు దృష్టికి తీసుకువస్తామని తెలిపారు. సీఆర్పీసీ 41 ఏ నోటీసులు అంటే అరెస్టు ప్రస్తావన రానందున .. ముందస్తు బెయిల్ పై విచారణ ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. దీంతో ఎఫ్ఐఆర్ లో ఎటువంటి మార్పులు చేశారు అనే దానిపై లోకేష్ తరుపు న్యాయవాదులు దృష్టి పెట్టారు.
మరో రెండు కేసుల్లో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు
నారా లోకేష్ మరో రెండు కేసుల్లో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ లు దాఖలు చేశారు. లోకేష్ తరపున ఆయన తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పై లంచ్ మోషన్ పిటిషన్ లు దాఖలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులు .. అత్యవసరంగా విచారించాలని కోరారు. ఈ పిటిషన్ లు ఇవేళ మధ్యహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
‘దోచిన లక్షకోట్లు ప్రభుత్వానికి ఇచ్చేయండి’