శివాజీ టార్గెట్ ఈసారి కలెక్టర్లు!

 

విజయవాడ, జనవరి2: హీరో శివాజీ మళ్లీ సంచలన  వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై కొత్త కుట్రకు మరోసారి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నుంచి ఓటర్లను దూరం చేయాలని చూస్తున్నారని అన్నారు. చుక్కల భూముల పేరుతో కుట్రకు తెర తీశారనీ, ఆ సాకుతో రైతులను ప్రభుత్వంపైకి ఉసిగొల్పాలని చూస్తున్నారనీ వ్యాఖ్యనించారు.

కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని శివాజీ ఆరోపించారు. విపక్షానికి ప్రజాసమస్యలు పట్టవనీ, వారికి కావాల్సింది సీఎం కుర్చీయేననీ విమర్శించారు. చుక్కల భూముల సమస్య రాజకీయ ఎత్తుగడకు అవకాశంగా మారిందని ఆరోపించారు. గట్టిగా మాట్లాడితే భూములు లాక్కుంటామని కొందరు కలక్టర్లు బెదిరిస్తున్నారని అన్నారు. ఆభూములు కలెక్టర్ అబ్బ సొత్తా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు బతిమిలాడుతున్నా కలెక్టర్లు వినడం లేదని తెలిపారు. ప్రజలను టార్గెట్ చేసిన అధికారుల చొక్కా పట్టుకుని అడుగుతానన్నారు. అన్ని ఆధారాలను సీఎం చంద్రబాబుకు అందజేస్తానని చెప్పారు. సంక్రాంతిలోగా సమస్యను పరిష్కరించకుంటే నిరాహార దీక్ష చేస్తానని శివాజీ అన్నారు.