గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పది మంది మృత్యువాత పడ్డారు. నవ్ సారి జిల్లా వెస్మా గామ సమీపంలో బసు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, బస్సు డ్రైవర్ కు గుండె పోటు రావడంతో డ్రైవింగ్ సీట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో వ్యక్తి ని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రైన్ ద్వారా ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ పునరుద్దరించారు.

బస్సులో ఉన్న వారు వారంతా సూరత్ లో జరిగిన ప్రముఖ్ స్వామి మహారాజ్ మహోత్సవ్ కు హజరై తిరిగి స్వగ్రామాలకు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ గుండె పోటు కారణంగా ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో బస్సు అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. కాగా ఈ ఘటనపై ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ దిగ్భాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంంబాలకు రూ.2లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేల వంతున ఎక్స్ గ్రేషియా మంజూరు చేసినట్లు పీఎంఓ కార్యాలయం ట్వీట్ చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ట్విట్టర్ వేదికగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు స్థానిక యంత్రాంగం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.