పోలీసులకు చెమటలు పట్టించిన మహిళలు..! ఎక్కడంటే..?

 

(చిత్తూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

ఓ యువకుడిని విచారణ పేరుతో తీసుకువెళ్లి విచక్షణారహితంగా కొట్టారని ఆరోపిస్తూ వందలాది మంది మహిళలు పోలీసు స్టేషన్ పై దాడి చేసి తీవ్ర విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వెదురుకుప్పం పోలీస్ స్టేషన్ లో జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు భైటాయించి ఆందోళన చేశారు.

వివరాల్లోకి వెళితే జిల్లాలోని వెదురుకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలోని యనమలమంద అనే గ్రామంలో గల ఎస్ సీ కాలనీలో బాల్య వివాహం జరిగింది. ఈ బాల్య వివాహానికి సహకరించారన్న అభియోగంతో బాబు అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ పేరుతో బాబును పోలీసులు చిత్ర హింసల పాలు చేశారని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. అద్దాలను పగుల గొట్టారు. ఫర్నీచర్ ను చిందర వందర చేశారు. అడ్డువచ్చిన పోలీసులపైనా దాడికి దిగారు. తరువాత స్టేషన్ ముందు భైటాయించి ఆందోళన చేశారు. స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీఎస్పీ మురళీధర్, సీఐ సురేందర్ రెడ్డి లు గ్రామానికి చేరుకున్నారు. అయితే గ్రామస్తులు రోడ్డుపై భైటాయించి అధికారుల రాకను అడ్డుకున్నారు. ఎస్ సీ కాలనీ వాసులకు డీఎస్పీ, సీఐలు ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు ససేమిరా అన్నారు. అకారణంగా యువకుడిని కొట్టిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఆందోళన కొనసాగించారు. తరువాత స్టేషన్ కు చేరుకున్న డీఎస్పీ ఇక్కడి పరిస్థితులను జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్‌కు వివరించారు.