వైసీపీలో చేరికల వెనుక కేసీఆర్, మరికొందరు కూడా: చంద్రబాబు


అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్‌, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహాయంతోనే టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారని ఆరోపించారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు.

హైదరాబాద్‌లో ఆస్తులున్నవారిని‌.. వైసీపీలో చేరాలని కేసీఆరే ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోపించారు.. పదవుల మీద ఆశలున్న వారిని జగన్, కేసీఆర్ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఒకరిద్దరు పార్టీ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని చంద్రబాబే స్వయంగా చెప్పడం గమనార్హం. పిలిచి పదవులిస్తే ఇప్పుడు వేరే పార్టీల వైపు చూస్తున్నారని దుయ్యబట్టారు. వారు పోయినంత మాత్రాన టీడీపీకి వచ్చే నష్టమేమీ లేదని అన్నారు.

పోలవరంపై కేసీఆర్‌ కేసు వేస్తే జగన్‌ స్పందించడం లేదని, ఇక జగన్‌ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తవుతుందా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో వైసీపీ అధినేత జగన్‌కు దిక్కుతోచడం లేదని అన్నారు. వైసీపీ ఎన్ని పన్నాగాలు పన్నినా బీసీలు టీడీపీ వెంటే ఉంటారని అన్నారు.

చంద్రబాబుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ

గవర్నర్‌ వైఖరికి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన పుదుచ్చేరి సీఎం నారాయణస్వామికి సంఘీభావం తెలిపిన అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. సోమవారం ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. దేశ రాజకీయాలపై వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.

బీజేపీయేతర పార్టీలతో ప్రత్యామ్నాయ కూటమిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సీఎంలిద్దరూ చర్చించారు. ఫిబ్రవరి 26 లేదా 27వ తేదీల్లో ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల నాయకులంతా మరోసారి భేటీ కానున్నారని, ఈ క్రమంలోనే సీఎంల సమావేశం జరిగిందని అధికార పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.