ఉత్తి పుణ్యానికి ఆత్మహత్య చేసుకుంటారా?

పుట్టకోట రైతు కోటయ్య మృతి వివాదంలో నుంచి బయటపడేందుకు టిడిపి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే అది అంత తేలికగా కనబడడం లేదు. అధికారపక్షాన్ని ఇబ్బందిలోకి నెట్టే ఏ అవకాశాన్నీ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ వదులుకోదు. పైగా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నేరుగా ఇబ్బంది పెట్టగల వివాదం. ఆపై ఎన్నికల సీజన్. వెరసి వైఎస్సార్ కాంగ్రెస్‌కు కోటయ్య మృతి గొప్ప అవకాశం. ఎంతవరకూ లాగాలో అంతవరకూ లాగుతారు.

కోటయ్య మృతి వివాదంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఒకచోట పొరపాటు చేసింది. కొండవీడు ఉత్సవం సభకు వస్తున్న ముఖ్యమంత్రి కోసం హెలీపాడ్ ఏర్పాటు చేసింది కోటయ్య పొలంలోనే అని ప్రకటించింది. నిజానికి అది వాస్తవం కాదు. ఆ అవకాశాన్ని మంత్రి పత్తిపాటి పుల్లారావు అందిపుచ్చుకున్నారు. అది కోటయ్య పొలం అని నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానని సవాలు చేశారు.

కోటయ్య మృతి కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న మరో వాదన ఆయన ఆత్మహత్య చేసుకోలేదనీ, పోలీసు దెబ్బలకు ప్రాణాలు వదిలాడన్నది. ఇది తేలాలంటే పోస్టుమార్టం నివేదిక రావాలి. కోటయ్య మృతదేహనికి చిలకలూరిపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మూడు రోజులయినా ఇంకా నివేదిక రాలేదు.

కోటయ్య కౌలు రైతు. 14 ఎకరాలు సాగు చేస్తున్నాడు. అప్పులు ఏమన్నా ఉందీ లేనిదీ తెలియదు. అయితే ఈ సంఘటనకు ముందు అతను ఎవరితోనూ ఘర్షణ పడింది లేదు. ఎవరూ అప్పు చెల్లించాలని నిలదీసింది లేదు. ఎక్కడా ఎలాంటి అసాధారణమైన పరిణామమూ చోటు చేసుకోలేదు. ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్న రైతు అకస్మాత్తుగా పురుగుమందు తాగి ప్రాణం ఎందుకు తీసుకుంటాడని కోటయ్య కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు.

కోటయ్య మృతిని వివాదం చేస్తున్నది ఒక్క ప్రతిపక్షమే కాదు. అతని కుటుంబం కూడా కోటయ్య మృతికి పోలీసులే కారణమని ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలో నిజం లేనపుడు అతను ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందీ అనుమానానికి తావు లేని పద్ధతిలో నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కోటయ్య కుటుంబసభ్యులు అంటున్నట్లు ప్రశాంతంగా పొలం చేసుకునే మనిషి హఠాత్తుగా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడతాడు?

photo courtesy: Sakshi