NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Election 2023: ఎవరికెవరు దోస్తులు .. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్న పార్టీలు

Share

Telangana Election 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతోంది. వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అభ్యర్ధులు ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు చేస్తున్నారు. మూడో సారి అధికారమే లక్ష్యంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ రోజుకు మూడు నాలుగు ప్రజా ఆశీర్వద సభల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధుల విజయానికి ఒక పక్క కేసిఆర్ మరో పక్క మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

బీజేపీ తరపున ఆ పార్టీ అగ్రనేతలు పీఎం నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు ప్రచారం చేస్తున్నారు. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తొంది. బీఆర్ఎస్, బీజేపీ లోని అసంతృప్తులను చేర్చుకుంటోంది.  కాంగ్రెస్ విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్దా రామయ్య, డిప్యూటి సీఎం డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులు స్టార్ కాంపెయినర్స్ గా ప్రచారం నిర్వహిస్తున్నారు.

అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సి ఏమిటంటే.. ఏ రాజకీయ పార్టీ ఎవరితో పొత్తులో ఉంది. ఏ పార్టీ ఎవరితో మిలాఖత్ లో ఉంది అనేది బేతాళ ప్రశ్నగా కనబడుతోంది. ఇందుకు ప్రదాన రాజకీయ పార్టీల నేతలు తమ ప్రసంగాల్లో ప్రత్యర్ధి పార్టీలపై చేస్తున్న విమర్శలు కారణం. బీజేపీకి బీఆర్ఎస్ బీ పార్టీ అని కాంగ్రెస్ విమర్శిస్తుంటే.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని బీజేపీ అంటోంది. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అధికారికంగా పొత్తు లేకపోయినా బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించడం వల్ల ఈ రెండు పార్టీలు ఒకటే అంటే తప్పులేదు. కానీ ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒకటే అని బీజేపీ విమర్శించడం అర్ధం లేదు.

వాస్తవానికి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఇటు ఎన్ డీ ఏ కూటమిలో అటు ఇండియా కూటమిలోనూ లేరు. అయినప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని బీజేపీ విమర్శిస్తుంది. ఇందుకు వారి మధ్య ఉన్న అనధికార ఒప్పందం ఏదీ చెప్పడం లేదు బీజేపీ. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కూడా ఆ రెండు పార్టీల మాదిరిగానే విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్పు చేసినప్పటికీ ఇంకా ప్రాంతీయ పార్టీ అధినేతగానే వ్యవహరిస్తూ మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీనే తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు కేసీఆర్.

తాజాగా శనివారం జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసిఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే మహారాష్ట్ర లో అడుగు పెడతానని, తనను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటైయ్యాయని అన్నారు. టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు కేసిఆర్ గతంలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేశారు. ఆ తర్వాత  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు అనధికార మిత్రపక్షంగానే వ్యవహరించారు అన్నది అందరికీ తెలిసిందే. ఉభయ సభల్లో కీలక బిల్లుల ఆమోదానికి టీఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరించింది.

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు బద్దశత్రువులు. అటువంటిది ఈ రెండు పార్టీలు తనను ఓడించేందుకు కలిశాయి అని కేసిఆర్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నుండి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు మాత్రం బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ – కాంగ్రెస్ ఒకటే అని గానీ, బీజేపీ – కాంగ్రెస్ ఒకటే అని గానీ ఎవరూ అనడం లేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ – జనసేన, కాంగ్రెస్ – సీపీఐ పొత్తులో పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుంది. అలానే ఎంఐఎం, సీపీఎం ఒంటరిగా కొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కానీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు ప్రత్యర్ధి పార్టీలపై చేస్తున్న విమర్శలు ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఒక వేళ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకుండా హంగ్ ఏర్పడితే అప్పుడు ఎవరెవరు మిత్రులో, ఎవరు ఎవరితో కలుస్తారో.. ఎవరెవరు శత్రువులో తెలిసిపోతుంది.

Telangana Election: సజల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ


Share

Related posts

YSR Awards: ఏపీ సర్కార్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

somaraju sharma

Monal gajjar : మోనాల్ గజ్జర్ కి హిట్ ఇచ్చిన సల్మాన్ ఖాన్…ఇక బాలీవుడ్ లో సెటిల్ అయినట్టే ..!

GRK

Madanapalle case: ఖైదీలకు దేవుణ్ణి చూపిస్తున్న పద్మజ.. అసలు జైలు లో ఏమి జరుగుతుంది??

Naina