సాంకేతిక విప్లవం కారణంగా ఇప్పటికే అనేక వినూత్నమైన వస్తువులు అందుబాటులోకి వచ్చి మానవ జీవితాన్ని మరింత సుఖమయంతో పాటు సౌకర్యవంతంగానూ మార్చాయి. అనారోగ్య సమస్యలను సైతం ఇట్టే తగ్గించే వస్తువులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మీరు సుఖమయమైన నిద్ర పొందడానికి సహాయం చేయడంతో పాటు మీ గురక సమస్యను కూడా తగ్గించే ఓ తలగడను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది ఓ సంస్థ. ఆ వివరాలు మీ కోసం..!
నిద్రలో గురక పెట్టడం అనేది ఎంత పెద్ద సమస్యో అందరికి తెలిసిందే. గురక పెట్టడం వల్ల ఎక్కువ ప్రభావితమయ్యేది వారి పక్కన పడుకున్న వాళ్లే. గురక కారణంగా కుటుంబాల్లో కలహాలు వచ్చిన సంఘటనల గురించి వార్తల్లో చాలానే వచ్చాయి. అలా వ్యక్తుల మధ్య దూరాన్ని పెంచే, అనారోగ్యానికి కారణమైయ్యే గురకను తగ్గించడానికి ఇప్పటికే వైద్యులు చాలానే సూచనలు చేశారు. దీని నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నాలే చేసి ఉంటారు. కానీ కొందరు బయటపడకుండా ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు.
అలాంటి వారి కోసం ఓ శుభవార్త. ఎందుకంటే గురక సమస్యను దూరం చేసే ఓ తలగడను ఓ సంస్థ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆ తలగడ పేరే “మ్యట్రిక్స్ పిల్లో”. దీనిని వాడటం వల్ల గురక సమస్య దూరం కావడంతో పాటు మంచి నిద్ర కూడా పొందుతారని సదరు సంస్థ వెల్లడించింది. సాధారణంగా ఉండే పిల్లో కంటే చాలా భిన్నమైనది, నిద్ర సమయంలో మనం పడుకునే అనేక రకాలైన భంగిమలను దృష్టిలో ఉంచుకుని దీనిని తయారు చేశామని తెలిపింది.
ఈ మ్యాట్రిక్స్ పిల్లో తయారీలో తలకు, మనం ఏ భంగిమలో పడుకున్న సౌకర్యవంతంగా ఉంటే విధంగా దీనిని తయారు చేశారు. ఇందులో రెండు లేయర్లతో కూడిన పలు మిశ్రమ పదార్థాలతో రూపొందించినట్టు ఆ సంస్థ తెలిపింది. దీనిని మొత్తం 14 క్యూబ్‌లుగా విభజించి తయారు చేశామనీ, దీని కారణంగా ఎలాంటి అసౌర్యం ఉండదని వివరించింది. ఈ తలగడను వినియోగించడం ద్వారా శరీరానికి శక్తి, రోగ నిరోధక శక్తి సైతం అందుతుందని తెలిపింది. ఇన్ని ప్రయోజనాలు అందించే ఈ మ్యాట్రిక్స్ పిల్లో ధర భారీగానే ఉంది. ప్రస్తుతం యూకే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ పిల్లో ధర రూ.59 పౌండ్లు అంటే మన కరెన్సీలో రూ. 5,821 అన్నమాట. త్వరలోనే భారత్‌లోనూ అందుబాటులోకి రానున్నాయి.