అమెరికాలో 17 అడుగుల కొండచిలువ
ఒక అంతస్తు భవనం కంటే ఎక్కువే
మియామి: అమెరికాలో పరిశోధకులు కొండచిలువల దాడి నుంచి తప్పించుకోవడం ఎలా అని చూస్తుంటే, ఇంతలో వాళ్లకు ఓ కొత్త సమస్య వచ్చిపడింది. జింకను సైతం అవలీలగా నమిలి మింగేయగలిగిన 17 అడుగుల పొడవున్న కొండ చిలువ ఒకటి వాళ్లకు పట్టుబడింది. దాదాపు ఒక అంతస్తు ఇల్లంత ఎత్తు ఉండే ఈ ఆడ చిలువ బరువు సుమారు 64 కిలోలు.
ఇటీవలి కాలంలో దక్షిణ ఫ్లోరిడా ప్రాంతంలో పట్టుబడిన కొండ చిలువలలో ఇదే అతి పెద్దది. ఈ విషయాన్ని బిగ్ సైప్రస్ నేషనల్ ప్రిజర్వ్ సంస్థ ఫేస్ బుక్ పేజీలో రాశారు. మగ కొండ చిలువలకు రేడియో ట్రాన్స్ మిటర్లు ఏర్పాటుచేసి, వాటి సాయంతో ఆడ కొండచిలువలను ఆకర్షించి అవెక్కడున్నాయో తెలుసుకుని మరీ పట్టుకుంటున్నారు. దాడిచేసే పాములను పట్టుకోవడంతో పాటు.. వాటిపై పరిశోధన చేస్తున్నారని తెలిపారు.
పట్టుబడిన ఆడ కొండచిలువ కడుపులో 73 గుడ్లున్నాయి. ఫ్లోరిడా ప్రాంతంలో వీటికి అడ్డు లేకపోవడంతో చాలా త్వరగా వీటి జనాభా పెరుగుతోంది. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులకు వీటివల్ల ముప్పు పొంచి ఉంటోంది. కుందేళ్లు, పక్షుల నుంచి పెద్ద మొసళ్లు, జింకలను కూడా ఇవి చంపేస్తున్నాయి. 1980లలో తొలిసారి పట్టుబడినప్పటి నుంచి బర్మీస్ కొండచిలువ దాడిచేసే రకమని అంటున్నారు. దక్షిణ ఫ్లోరిడాలో 30 వేల నుంచి 3 లక్షల వరకు కొండచిలువలు ఉన్నాయని అంచనా. దాంతో వీటిని చంపడానికి పాములను చంపే ఆస్ట్రేలియన్ టెర్రియర్ కుక్కలను రప్పించడం, పక్షులను వీటిబారి నుంచి కాపాడేందుకు చెట్ల చుట్టూ కంచెలు వేయడం, కొండచిలువల ఆచూకీ కనిపెట్టేందుకు డ్రోన్ల ఉపయోగం వంటివి చేస్తున్నారు. అలాగే ఆసియాలో పాములను చంపే ముంగిసలను కూడా ఇక్కడకు రప్పించాలని భావిస్తున్నారు. పోర్టారికో, వర్జిన్ ఐలండ్స్ ప్రాంతంలో పాములను ముంగిసలు అంతమొందించాయి. అవి కొండచిలువలను కూడా చంపగలవని పరిశోధకులు చెబుతున్నారు. కొండచిలువలకు అసలు తెలివి ఉండదు. గోల్ఫ్ బంతులను గుడ్లు అనుకుని తినేసి కొన్ని చనిపోయాయి. దాంతో ఇలా వందలాది నకిలీ గుడ్లు పెట్టి వాటిని చంపచ్చని కొందరు సలహా ఇస్తున్నారు.