Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ రోజు అత్యంత కీలకం కానుంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో నెల రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు. ఈ రోజు న్యాయస్థానాల నుండి తీర్పులు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు ఈ రోజు అనుకూల తీర్పు వస్తుందా .. రాదా అనే టెన్షన్ టీడీపీ శ్రేణుల్లో, ఆ పార్టీ అభిమానుల్లో నెలకొంది. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబు తొలి సారిగా జైలు గోడల మధ్య నెల రోజుల పాటు ఉండిపోవడం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
దిగువ కోర్టు నుండి దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ, తీర్పులు ఈ రోజు ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ తన పై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని సుప్రీం కోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై ఇవేళ విచారణ జరగనుంది. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, అభిషేక్ మను సింగ్వీ, సిద్ధార్థ్ లూథ్రాలు, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్ లు వాదించనున్నారు.
అవినీతి నిరోధక చట్టం 17 ఏ చంద్రబాబు కేసులో వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు, చంద్రబాబుకు వర్తించదని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ఇదే క్రమంలో అవినీతి నిరోధక చట్టం 17ఏ (1) రాజ్యాంగ బద్దతను సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 20వ తేదీ విచారణకు రావడంతో దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఇటు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు తీర్పు వెల్లడికానుంది. అలానే చంద్రబాబును సీఐడీ కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్ పై కూడా ఏసీబీ కోర్టు ఇవేళే ఉత్తర్వులు జారీ చేయనున్నది. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం ఏబీసీ కోర్టులో వాదనలు ముగియగా, ఉత్తర్వులను సోమవారం (ఈరోజు) వెల్లడిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు.
మరో పక్క చంద్రబాబుకు సంబంధించి మూడు బెయిల్ పిటిషన్ల పై ఏపీ హైకోర్టు ఈరోజు తీర్పులు వెల్లడించనుంది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు ఘటన, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిల్ కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి తీర్పులను రిజర్వు చేశారు. ఈ మూడు పిటిషన్ల పైనా ఇవేళే తీర్పులు రానున్నాయి.