ఏపీ, తెలంగాణ బీజేపీ చీఫ్ లను పార్టీ అధిష్టానం మార్చేసింది. రెండు మూడు రోజుల కసరత్తు అనంతరం బీజేపీ అధిష్టానం ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ లను ఆ బాధ్యతల నుండి తప్పించింది. ఏపీ అధ్యత్ర పదవి రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు వినిపించినప్పటికీ… చివరకు ఊహించని విధంగా ఆ పదవి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి దక్కింది. దగ్గుబాటి పురందేశ్వరిని ఏపీ బీజేపీ చీఫ్ గా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధిష్ఠానం నియమించింది.

అధ్యక్ష మార్పుల విషయంలో బండి సంజయ్ ను ఢిల్లీకి పిలిపించి కేంద్ర నాయకత్వం చర్చించింది. ఆ తర్వాతనే నూతన అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు వెలవడ్డాయి. అయితే ఏపీ విషయానికి వస్తే ఇవేళ మధ్యాహ్నం సోము వీర్రాజుకు జేపి నడ్డా ఫోన్ చేసి పదవి నుండి తప్పిస్తున్నట్లుగా చెప్పినట్లు సమాచారం. పదవీ కాలం పూర్తి అయినందున రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారుట. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఏపీ, తెలంగాణకు సంబంధించి అధ్యక్షుల నియామకానికి ఉత్తర్వులు వెలవడ్డాయి.
అంతే కాకుండా తెలంగాణకు చెందిన మాజీ మంత్రి, హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ గా పార్టీ అధిష్టానం నియమించింది. చేరికల కమిటీ చైర్మన్ పదవి పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు. బండి సంజయ్ నాయకత్వంపై ఈటల విముఖంగా ఉన్నారు. రెండు రోజుల క్రితం ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర బీజేపీ పెద్దలను కలిసి వారి మనసులోని మాట చెప్పారు. ఈ తర్వాతనే ఈ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
వంగవీటి మోహనరంగా పేరు జిల్లాకు ఎందుకు పెట్టలేదో చెప్పాలి – వంగవీటి రాధా